Tuesday, December 23, 2008

చిరు భేష్

మిగతా వాళ్ల సంగతి తెలీదు కాని నాకు మాత్రం మొదటి నుంచి చిరు ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలు నచ్చుతున్నాయి.
చాలా మంది ప్రజా యాత్రలు చేస్తున్నారు కాని, చిరు యాత్రలకి వాటికి తేడా ఏంటంటే, చిరు స్థానిక సమస్యల పైన ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. మొదట చిరు బహిరంగంగా బైటకు వచ్చి ప్రజలను కలిసింది సిరిసిల్ల లోని నేత కార్మికులను. అప్పటి వరకు అసలు దాని గురించి పెద్దగా చర్చే జరగలేదు. ఎప్పుడైతే చిరు అక్కడికి వెళ్ళాడో పాలక పక్షం నుంచి ప్రతి పక్షం దాక అందరు దాని గురించే చర్చించారు కొన్ని రోజులు. ఇది ముమ్మాటికీ చిరు గొప్పతనమే. సిరిసిల్ల తర్వాత పోలేపల్లి పర్యటన కు కూడా అలాంటి స్పందనే లభించింది. ఇంక తర్వాత శ్రీకాకుళం పర్యటన లో కోడి రామ్మూర్తి గారి గురించి చర్చించి ఆయన గుర్తుగా ఏదో చేస్తాము అని చెప్పారు. ఇవ్వాల్టి రోజుల్లో ఇందిరమ్మ ని, రాజీవయ్యని తప్ప మన పాలకులు తెలుగు నాట ఎంతో ఖ్యాతి గడించిన అమర వీరులను అసలు పట్టించుకుంటున్నారా చెప్పండి. వీళ్ళని ఎన్నుకొని మన ఆత్మ గౌరవాన్ని మనమే చంపుకుంటున్నాం.
ఇక ఈమధ్య పర్యటనల విషయానికి వస్తే, ఎన్ హెచ్ ౯ (తొమ్మిది) ప్రస్తావన.. హైదరాబాదు నుంచి విజయవాడ కి బస్సు లో వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. రాత్రి బయల్దేరాలంటే గంటలు గంటలు ట్రాఫిక్ జామ్. ఎన్నింటికి ఇంటికి చేరతామో తెలియని పరిస్థితి. రాష్ట్రం లో బాగా రద్దీ ఉండే రోడ్లలో అది ఒకటి. సంవత్సరాల తరబడి దాని పరిస్థితి అలానే ఉన్నా పట్టించుకున్న నాధుడే లేడు. నల్గొండ లోని ఫ్లోరైడ్ సమస్య కుడా ఇలాంటిదే. ఇలాంటి నిజమైన సమస్యలను ప్రస్తుతించటం లో విపక్షాలు కుడా విఫలం అయ్యాయనే చెప్పాలి.
ఇంక చిరు మీద విమర్శల విషయానికి వస్తే చిరు మార్పు అంటున్నాడు కాని, మార్పు అంటే ఏంటో చెప్పట్లేదు. సరైన అజెండా లేదు చిరు కి అంటున్నారు. మార్పు అంటే ఏదో సినిమా లో చూపినట్లు హైదరాబాదు కి సముద్రం తేనవసరం లేదు . చేసే పనులే సక్రమంగా చేస్తే ప్రజలందరికీ ఫలాలు సక్రమంగా అందుతాయి. ఇంక అజెండా విషయానికి వస్తే ఏ ఒక్క పార్టీ కి ఆయినా సరి ఆయినా అజెండా ఉందా, ప్రభుత్వాన్ని కిందకి దించటం తప్ప. అదే ఉంటే సమైక్య ఆంధ్రా వాదన వినిపించే సిపిఐ , సిపిఎం వాళ్ళు తెరాస లాంటి పార్టీ లతో పొత్తు పెట్టుకుంటారా?
ఇప్పడు చిరు ముందున్న అతి పెద్ద సవాలు ఎన్నికల వరకు ఈ ఊపు ని కొనసాగించి ఎన్నికల్లో గెలవటం. ఆ తర్వాత తను కోరుకున్న మార్పు ప్రజలకు చూపించటం. ఈ రెండిట్లో ఎంత వరకు విజయం సాధిస్తాడో వేచి చూడాల్సిందే.
ఇంకా నేను కోరుకోనేదేంటంటే ఆచరణ లో ఆదరణ కోల్పోతున్న తెలుగు కి కూడా చిరు ఏదన్నా చేయాలని.