Tuesday, December 23, 2008

చిరు భేష్

మిగతా వాళ్ల సంగతి తెలీదు కాని నాకు మాత్రం మొదటి నుంచి చిరు ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలు నచ్చుతున్నాయి.
చాలా మంది ప్రజా యాత్రలు చేస్తున్నారు కాని, చిరు యాత్రలకి వాటికి తేడా ఏంటంటే, చిరు స్థానిక సమస్యల పైన ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. మొదట చిరు బహిరంగంగా బైటకు వచ్చి ప్రజలను కలిసింది సిరిసిల్ల లోని నేత కార్మికులను. అప్పటి వరకు అసలు దాని గురించి పెద్దగా చర్చే జరగలేదు. ఎప్పుడైతే చిరు అక్కడికి వెళ్ళాడో పాలక పక్షం నుంచి ప్రతి పక్షం దాక అందరు దాని గురించే చర్చించారు కొన్ని రోజులు. ఇది ముమ్మాటికీ చిరు గొప్పతనమే. సిరిసిల్ల తర్వాత పోలేపల్లి పర్యటన కు కూడా అలాంటి స్పందనే లభించింది. ఇంక తర్వాత శ్రీకాకుళం పర్యటన లో కోడి రామ్మూర్తి గారి గురించి చర్చించి ఆయన గుర్తుగా ఏదో చేస్తాము అని చెప్పారు. ఇవ్వాల్టి రోజుల్లో ఇందిరమ్మ ని, రాజీవయ్యని తప్ప మన పాలకులు తెలుగు నాట ఎంతో ఖ్యాతి గడించిన అమర వీరులను అసలు పట్టించుకుంటున్నారా చెప్పండి. వీళ్ళని ఎన్నుకొని మన ఆత్మ గౌరవాన్ని మనమే చంపుకుంటున్నాం.
ఇక ఈమధ్య పర్యటనల విషయానికి వస్తే, ఎన్ హెచ్ ౯ (తొమ్మిది) ప్రస్తావన.. హైదరాబాదు నుంచి విజయవాడ కి బస్సు లో వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. రాత్రి బయల్దేరాలంటే గంటలు గంటలు ట్రాఫిక్ జామ్. ఎన్నింటికి ఇంటికి చేరతామో తెలియని పరిస్థితి. రాష్ట్రం లో బాగా రద్దీ ఉండే రోడ్లలో అది ఒకటి. సంవత్సరాల తరబడి దాని పరిస్థితి అలానే ఉన్నా పట్టించుకున్న నాధుడే లేడు. నల్గొండ లోని ఫ్లోరైడ్ సమస్య కుడా ఇలాంటిదే. ఇలాంటి నిజమైన సమస్యలను ప్రస్తుతించటం లో విపక్షాలు కుడా విఫలం అయ్యాయనే చెప్పాలి.
ఇంక చిరు మీద విమర్శల విషయానికి వస్తే చిరు మార్పు అంటున్నాడు కాని, మార్పు అంటే ఏంటో చెప్పట్లేదు. సరైన అజెండా లేదు చిరు కి అంటున్నారు. మార్పు అంటే ఏదో సినిమా లో చూపినట్లు హైదరాబాదు కి సముద్రం తేనవసరం లేదు . చేసే పనులే సక్రమంగా చేస్తే ప్రజలందరికీ ఫలాలు సక్రమంగా అందుతాయి. ఇంక అజెండా విషయానికి వస్తే ఏ ఒక్క పార్టీ కి ఆయినా సరి ఆయినా అజెండా ఉందా, ప్రభుత్వాన్ని కిందకి దించటం తప్ప. అదే ఉంటే సమైక్య ఆంధ్రా వాదన వినిపించే సిపిఐ , సిపిఎం వాళ్ళు తెరాస లాంటి పార్టీ లతో పొత్తు పెట్టుకుంటారా?
ఇప్పడు చిరు ముందున్న అతి పెద్ద సవాలు ఎన్నికల వరకు ఈ ఊపు ని కొనసాగించి ఎన్నికల్లో గెలవటం. ఆ తర్వాత తను కోరుకున్న మార్పు ప్రజలకు చూపించటం. ఈ రెండిట్లో ఎంత వరకు విజయం సాధిస్తాడో వేచి చూడాల్సిందే.
ఇంకా నేను కోరుకోనేదేంటంటే ఆచరణ లో ఆదరణ కోల్పోతున్న తెలుగు కి కూడా చిరు ఏదన్నా చేయాలని.

Monday, October 27, 2008

కొత్తగూడెం క్లబ్ వారి 'బాలోత్సవ్'

నిన్న (26 అక్టోబర్ 2008) ఈనాడు ఆదివారం పుస్తకం లో వచ్చిన ఈ వ్యాసం చూడండి.
http://www.eenadu.net/archives/archive-26-10-2008/htm/weekpanel1.asp
నాకైతే ఈ ప్రయత్నం వినూత్నం గా చాలా చక్కగా అనిపించింది. అందులో విశేషం ఏంటంటే వాళ్లు కార్యక్రమం అంతా తెలుగులోనే చేస్తారు. పిల్లలకి తెలుగు మీద మమకారం కలిగేలా చేస్తారు. ఇలా మామూలుగా బళ్లలో లో కాకుండా ఒక రెండు మూడు రోజుల ట్రిప్స్ లో పిల్లలకి ఇలాంటివి చెప్పటం వల్ల పిల్లల్లో మాతృభాష మీద మమకారం చిన్న వయసులోనే బలంగా నాటుకుంటుంది. ఇలా చిన్న వయసు లో పడే ముద్రలు జీవితాంతం ఉంటాయి. తెలుగు మీడియం లో చదివితే ఇంగ్లీష్ రాదు అని తెలుగు భాష మీద ప్రేమ ఉన్నా ఇంగ్లీష్ మీడియం లో పిల్లల్ని చేర్పించే వాళ్లు ఇలాంటి కార్యక్రమాల్లో పిల్లల్ని పాల్గొన చేయటం ద్వారా వాళ్ల రెండు ఆశలు నెరవేరుతాయి. ఈమధ్య మొదలు పెట్టిన "తెలుగు భాష ప్రచార సమితి" అనే సంఘం వాళ్లకి కూడా ఇలాంటి ఆలోచనలు ఉపయోగపడతాయేమో మరి.

Thursday, October 9, 2008

గూగుల్ న్యూస్ తెలుగు లో

ఈ మధ్యే గూగుల్ న్యూస్ తెలుగు లో కూడా మొదలయింది. ఇది మన కూడలి లాగా అన్ని వెబ్ సైట్ ల నుంచి వార్తలను సేకరించి చూపిస్తుంది. తెలుగు అభిమానులకు ఇది శుభవార్తే మరి. http://news.google.co.in/news?ned=te_in

Friday, October 3, 2008

సామాను తిరిగి పొందు 'స్దలము'

ఏoటి వీడెవడో బ్లాగు హెడ్డింగ్ కూడా తప్పు రాశాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఒప్పుకోరా? ఐతే కింద ఫొటో చూడండి.




ఇంకా అర్థం కాకపోతే పై ఫొటో బూతద్దం లో ఎలా ఉంటుందో కింద చూడండి.



మీకీపాటికి అర్థం అయ్యుంటుంది. ఇదేదో విమానాశ్రయ౦ లో బోర్డు లాగా ఉందే అని. అవును ... మీరు అనుకున్నట్లు ఇది మన హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం లోని ఒక బోర్డే. ఇలాంటి బోర్డులు అక్కడ వెతకటానికి పెద్ద సమయం పట్టదు. ఎందుకంటే అక్కడ తొంభై శాతం బోర్డుల్లో తెలుగు అలానే ఉంటుంది. చదువు, వృత్తి రీత్యా ఆరు సంవత్సరాలుగా అంధ్రా బైట ఉంటున్న నాకు సాధారణంగా ఎప్పుడైనా ఆంధ్రా లో అడుగు పెట్టగానే నా చూపు అంతా తెలుగు అక్షరాలపైకి వెళుతుంది. ఇలా ఒక బోర్డు కనపడగానే ఒక్కచోటన్నా తప్పు లేకుండా ఉంటుందేమోనని ఇంకో పది బోర్డులు వెతికినా 'స్థలము' అనే పదం ఒక్క చోట కూడా సరిగ్గా రాసిలేదు. ఎంటో ఆ మాత్రం తెలుగు రాసే వాడు కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన హైదరాబాదులో లేరా అనిపించింది. ఇక విమానాశ్రయం లో విమాన వివరాలు/గమనికలు తెలుగు లో అసలు ఉండనే ఉండవు. అంతర్జాతీయ విమానాశ్రయం లోనికి తెలుగు మాత్రమే వచ్చిన వాళ్లు అసలు ప్రవేశించటానికే అనర్హులు అని మన పాలకుల అభిప్రాయం కాబోలు. ఇలా ఒక రాష్ట్ర రాజధానిలో ఉండే ఒక విమానాశ్రయం లో ఆ రాష్ట్ర భాష లో గమనికలు లేక పోవటం బహుశా ప్రపంచం లో ఇక్కడే ఉండి ఉంటుంది. అంత (దుర+)అదృష్టం మనకే దక్కుతుంది.

ఇక ఈ విమానాశ్రయం గురించి అప్పట్లో జరిగిన ఏకైక చర్చ విమానాశ్రయం పేరు మీద. ఒక తెలుగు వాడిగా తెలుగు వాడి పేరు పెడితే నేను కుడా బాగా అనందిస్తాను. అది ఒక రకమైన ఆత్మగౌరవం లాంటిది. సరే అది ఎలాగు జరగలేదు కదా కనీసం విమానాశ్రయం లోపల అన్నా తెలుగు అమలు పరిస్తే బాగుంటుంది. మన ప్రభుత్వానికి ఇలాంటివి ఎలాగు పట్టవు. తెలుగు వాళ్ల "ఆత్మ గౌరవం" నినాదం వాడుకొనే "తెలుగు దేశం" వాళ్లకి గాని, కనీసం అధికార భాషా సంఘం వాళ్లకి గాని ఏమన్నా పడతాయంటారా ఇలాంటి విషయాలు?

Saturday, August 30, 2008

పుల్లాయన బ్లాగు

మన తెలుగు బ్లాగర్ల ఉత్సాహం చూసి నేను కూడా తెలుగు బ్లాగు రాయాలని ఎన్నో రోజులుగా అనుకుంటూ చివరికి ఇప్పుడు "నేను కూడా కూడలి లో చేరాను. ఒక బ్లాగు రాస్తున్నాను".

ఇక ఒక బ్లాగు తయారు చేయాలంటే ముందు చేయాల్సింది ఒక పేరు తయారు చెయ్యటం. ఇది ఎంతైనా చాలా కష్టమైన పని. ఇప్పటికే మన తెలుగు బ్లాగర్లు అందరూ మనకున్న కొన్ని మంచి, పిచ్చి అలాగే వింత, కొత్త, చెత్త పేర్లన్నీ పెట్టేసుకున్నారు. ఇంక నేను కూడా బాగా అలోచించి.. చించి ఇలా "పుల్లాయన" అనే కొత్త, వింత పేరు ఐతే వెరైటీ గా ఉంటుంది అని ఇలా పెట్టుకున్నాను. ఆ పేరు వెనక పెద్ద కథే ఉంది. దాని గురించి తర్వాత ఎప్పుడన్నా చెప్తాను లెండి. ప్రస్తుతానికైతే అలా ఫిక్స్ అయిపోయాను.

ఇక అందరూ తమ తమ బ్లాగుల్లో రాజకీయాలు, సినిమాలు, స్వగతాలు ఇలా ఒకటేమిటి, చాలా రాస్తున్నారు. నేను కూడా అలాగే నాకు తోచిన అంశాల గురించి రాస్తాను. మన తెలుగు బ్లాగర్లకు "లేఖిని", "కూడలి" లాంటి మంచి పనిముట్లను అందించిన చావా, వీవెన్ లాంటి వాళ్లు, అలాగే తెలుగు బ్లాగుల్లో మంచి ఉపయోగపడే విషయాలు అందిస్తున్న మన మిత్రులందరూ మనస్ఫూర్తిగా అభినందనీయులు.

Tuesday, May 20, 2008

టెస్టింగ్

హలో హలో హలో
అందరికి పుల్లాయన నమస్కారం.