Thursday, January 14, 2010

సంక్రాంతి ని పొంగల్ చేయకండే!

అరవం ఎఫెక్ట్ అంటే ఇదేనేమో. అట్టు దోశ అయింది, చారు కాస్తా సాంబార్ అయింది. కనీసం సంక్రాంతి ని అన్నా సంక్రాంతి అని చక్కగా పిలుచుకుందాం.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

Monday, January 4, 2010

తెలంగాణ, సమైక్య ఉద్యమాలకు పరిష్కారమేంటి?

తెలంగాణా నాయకులకు తెలంగాణా రాష్ట్రం కావాలి. రాష్ట్రం ఏర్పడితే రెండో స్థాయిలో ఉన్న నాయకులకు పెత్తనం వస్తుంది, హైదరాబాదును దోచుకోవచ్చు, అధికారం చలాయించవచ్చు, ఆంధ్రా వ్యాపార సంస్థలను బెదిరించి డబ్బులు పిండుకోవచ్చు. తెలంగాణా ప్రజలకు తెలంగాణా రాష్ట్రం కావాలి, ప్రత్యేక వాదులు ఊదరగొట్టినట్లు రాష్ట్రం ఏర్పడితే ఏమన్నా అభివృద్ధి జరుగుతుందేమోనని, కొత్త ఉద్యోగాలు వస్తాయేమోనని, జీవితాలు ఏమన్నా మారతాయెమోనని. ఆవేశం లో ఉన్నవాళ్లకు, లేని ఉద్యోగాలు ఎక్కడినుంచి వస్తాయని, రాజకీయ వ్యవస్థ మారకుండా జీవితాలు ఎలా మారుతాయని చెప్పినా అర్థం కాదు.
ఇక కోస్తాంధ్ర, సీమ ప్రజల విషయానికి వస్తే కలిసి ఉంటే కలదు సుఖం అనుకుంటున్నారు. ఒకే భాష వాళ్ళు విడిపోతే ఎలా అని ఆలోచిస్తున్నారు.

ఇవన్నీ సంతృప్తి చెందేలా ఒక పరిష్కారం ఆలోచిద్దాం.
ఇప్పటి వరకు తెలంగాణా వాదులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవటానికి పైకి చెప్పే కారణాలు ఈ కిందవి గా కనిపిస్తున్నాయి.

1) తెలంగాణా జిల్లాల్లో అభివృద్ధి లేదు. ఆంధ్రా ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయి.
2) ఇది తెలంగాణా ఆత్మ గౌరవ సమస్య, ఆంధ్రా వలస పాలకులు మాకొద్దు. మా తెలంగాణా ను మేమే పాలించుకుంటాం.
3) "మా తెలంగాణా" సంపద, (ఇక్కడ చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ ఉద్దేశం "మా హైదరాబాదు") ఉద్యోగాలను వలస ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారు.


ఇందులో మొదటి సమస్య "అభివృద్ధి":
తెలంగాణా నాయకులు గత పది సంవత్సరాలుగా అభివృద్ధి గురించి చేస్తున్న వాదనలలో ఏమాత్రం పస, రుజువు లేదు. ఇప్పటి వరకు ఈ అంశం మీద ప్రచారం చాలా ఏకపక్షం గా జరిగింది. ఏదో ఒకట్రెండు GO లనుపట్టుకొని హరీష్ రావ్ అస్సెంబ్లీ లో స్పీచ్ ఇవ్వగానే, "excellent speach on telangana" అంటూ youtube లో videO పెడతారు, జనాలు దాన్ని చూస్తారు కానీ మిగతా GO లలో తెలంగాణా కు భారీగా నిధులు మళ్లినా, అది అవసరం లేదు, అలాంటి వాటిని బయిటకు చెప్పే నాధుడే లేడు. విచిత్రం ఏంటంటే ఏ తెలంగాణా నాయకుడు కూడా ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాడ్డాక 1956 నుంచి ప్రభుత్వ నిధులు ఏఏ ప్రాంతానికి ఎంతెంత ఖర్చు పెట్టారో అడగలేదు. ఎందుకంటే ఎక్కడో మూలాన వాళ్ళకు కూడా తెలుసు నిజాలు. గమ్మత్తేంటంటే అలాంటి శ్వేతపత్రం లగడపాటి, ఉండవల్లి లాంటి ఆంధ్ర నాయకులు అడగటం. ఇక్కడ కిటుకు ఏంటంటే తెలంగాణా అభివృద్ధి లో ఆంధ్రా తో సమానంగా ఉంది అని కాదు, ఇప్పటికీ వెనక పడే ఉంది, కానీ 1956 లో ఆంధ్రా కి తెలంగాణా కి ఉన్న వ్యత్యాసం కన్నా ఇప్పుడు ఉన్న వ్యత్యాసం చాలా తక్కువ. దానికి కారణం సమైక్యాంధ్రప్రదేశ్.
సరే ఆ సంగతి పక్కన పెట్టి అభివృద్ధి సమస్య కు పరిష్కారం ఆలోచిద్దాం. ఇది అన్నటికన్నా సులువైన సమస్య. దీనికి పరిష్కారం అభివృద్ధి చేసుకోవటం కానీ, రాష్ట్రాన్ని విడదీయటం కాదు. ఎందుకంటే రాష్ట్రాన్ని విడగొట్టాక కూడా అభివృద్ధే కదా చేసుకొనేది, అలాంటప్పుడు అదేదో ఇప్పుడే చేసుకోవచ్చు, పైగా సమైక్య రాష్ట్రం లో ప్రభుత్వ నిధులు ఎక్కువ ఉంటాయి కదా. ఇకపోతే రాష్ట్రంలో అభివృద్ధి లేని జిల్లాలు ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నాయి కాబట్టి మౌలిక వనరుల ప్రాతిపదికన వెనకబడిన జిల్లాలను గుర్తించి వాటన్నిటికి నిధులు కేటాయించవచ్చు. తెలంగాణా లో ఎక్కువ వెనకబడిన జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఈ నిధులలో సింహభాగం తెలంగాణా కే దక్కుతుంది కాబట్టి తెలంగాణా వాదులు కంప్లయింట్ చేయాల్సిన పని లేదు.


ఇక రెండోది: ఆత్మ గౌరవ సమస్య, మమ్మల్ని మేమే పాలించుకుంటాం:
నా దృష్టిలో ఇది అర్థం పద్ధo లేని, అనుమానాస్పదమైన ప్రకటన. ఇప్పుడు తెలంగాణ ను ఎవరు పాలిస్తున్నారో చూద్దాం. ప్రస్తుతానికి తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ను పాలిస్తుంది. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు. అధికారులు ఎలాగూ దేశం లో ఎక్కడివాళ్లైనా అయ్యుండొచ్చు. కాబట్టి వాళ్ళ గురించి ఇక్కడ చర్చ అనవసరo. ఇక మంత్రులు: వాళ్ళు మూడో వంతుకు పైగానే తెలంగాణ నుంచి ఉన్నారు. కాబట్టి అధికారులు, మంత్రుల విషయం లో ఆత్మ గౌరవం అర్థరహితం. ఇకపోతే మిగిలింది ముఖ్యమంత్రి. ఈయన కోస్తాంధ్ర వ్యక్తి. కాబట్టి తెలంగాణా వాదులు వాదించే ఆత్మ గౌరవం ఒక్క ముఖ్యమంత్రి పదవి గురించే అనిపిస్తుంది. తెలంగాణా నాయకులు ఆంధ్రప్రదేశ్ ఏర్పాడ్డాక ముఖ్యమంత్రి పదవుల్లో ఎక్కువ కాలం లేరన్నది వాస్తవం. కాబట్టి కొన్ని సంవత్సరాలు అన్నీ పార్టీలు తెలంగాణా వాళ్లనే ముఖ్యమంత్రులను చెయ్యాలి. అలా ఒక 10 - 15 యేళ్లు అయ్యాక అప్పటికి అన్నీ ప్రాంతాల వారు సమానంగా పాలించినట్లు అవుతుంది. అప్పటి నుంచి రొటేషన్ పద్ధతి లో ఒక్కో ప్రాంతం వారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలి. ఈ పరిష్కారం తెలంగాణ వాదులకు నచ్చకపోయినా వాళ్ళు ఏమీ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకు సంతృప్తి కలగాలంటే వాళ్ళు చేయాల్సింది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కాదు, ప్రత్యేక దేశం ఉద్యమం. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడినా వాళ్ళను కేంద్రం అంటే ప్రధాన మంత్రి పాలిస్తాడు కాబట్టి. So "ఆత్మగౌరవ సమస్య" is also solved.

ఇక మూడోది: తెలంగాణ/హైదరాబాద్ సంపద/హైదరాబాద్ ఫ్రీజోన్ కాదు:
ఇక్కడ తెలబాన్లు చేసే ప్రకటనలు "ఆంధ్ర పెట్టుబడి/భూకబ్జా దారులను, వ్యాపార సంస్థలను తరిమి కొడతాo". ఇందులో చివరిది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డా అసలు జరిగే పని కాదు ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం దేశ పౌరులు ఎక్కడైనా స్థలాలు కొనుక్కోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. ఈ విషయం లో ఒక తెలంగాణా వ్యక్తికి ఎన్ని హక్కులు ఉంటాయో మిగతా రాష్ట్రాల వాళ్ళకు కూడా అన్నే ఉంటాయి.
సరే హైదరాబాద్ ఉద్యోగాల సంగతి కి వద్దాం. కోస్తాంధ్ర, రాయలసీమ వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి తరలి రావటానికి కారణం ఇక్కడి ఉపాధి సౌకర్యాలు. రాష్ట్ర రాజధాని అవ్వటం చేత, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వివిధ రంగాలు అభివృద్ధి చెందుతుండటం వల్ల ఇక్కడ ఉపాధి మార్గాలు అనేకం. అలాగే రాష్ట్ర రాజధాని కావటంతో వివిధ ప్రభుత్వ శాఖల హెడ్ఆఫీస్ లు హైదరాబాద్ లో పెట్టడం జరిగింది, దాని వల్ల ప్రభుత్వోద్యోగాలు ఇక్కడ అత్యధికం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఈ ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకు వస్తాయనుకోవటం భ్రమ ఎందుకంటే అప్పుడు చిన్న రాష్ట్రానికి అంత మంది ఉద్యోగుల అవసరం ఉండదు కాబట్టి. మళ్ళీ ముందు అనుకున్నట్లు private సంస్థల్లో ఆంధ్ర వాళ్ళ పోటీ ఉందనే ఉంటుంది.
సరే దీనికి పరిష్కారం ఏంటి? రాష్ట్ర రాజధాని కాబట్టి వలస ఆంధ్ర వాళ్ళు వచ్చి ఉంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అదే రాజధానినే కోస్తాంధ్ర/రాయలసీమ కు తరలిస్తే? ఈ ఆలోచనేదో అధ్భుతంగా ఉన్నట్లుంది. ఒక్క దెబ్బ కి రెండు పిట్టలు. ఆంధ్ర వాళ్ళు పెట్టుబడి దారులు, ఉద్యోగులు, వ్యాపారులు అందరూ కొత్త రాజధానికి చెక్కేస్తారు. హైదరాబాద్ లో వాళ్ల పీడా విరగడైపోతుంది. పొమ్మనకుండా పొగ పెట్టడం అంటే ఇదేనేమో! ఆ చేసే రాజధానేదో ఏ కర్నూల్,కడప జిల్లాలోనో లేక ఏ ప్రకాశం జిల్లాలోనో బాగా బీడు భూములు ఎక్కువగా ఉన్న చోట చేస్తే అక్కడ అభివృధ్ధి జరుగుతుంది, విజయవాడ, గుంటూర్ లాంటి ఊళ్లలోని పొలాలు కూడా నాశనం కాకుండా ఉంటాయి, రాష్ట్రంలోని మిగతా అన్నీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నట్లు అవుతుంది. ఎక్కడో తెలంగాణా వాదులు నన్ను బండబూతులు తిడుతున్నట్లు వినిపిస్తుంది. ఆగండాగండి మీకు విషయం అర్థం అయినట్లు లేదు. రాజధానిని హైదరాబాదు నుంచి ఆంధ్రా కి తరలించటం వల్ల ఎక్కువ గా లాభపడేది తెలంగాణా నే! ఎలా అంటారా? ఉదాహరణ కు, తెలంగాణా లో ఆంధ్రప్రదేశ్ ఆదాయం లో 40 శాతం ఖర్చు పెడతారు అనుకుందాం. అందులో హీన పక్షంలో హైదరాబాదు కే దాదాపు సగం అంటే 20 శాతం ఖర్చు పెడతారు, ఎందుకంటే రాష్ట్ర రాజధాని, రాష్ట్రంలోని నలుమూలలనుండి ఇక్కడికే వస్తారు కాబట్టి మౌలిక సదుపాయాలకు బాగా ఖర్చు అవుతుంది. సొ హైదరాబాద్ లో ఖర్చు పోగా మిగిలిన 20 శాతం 9 తెలంగాణా జిల్లాల్లో ఖర్చు పెడతారు. అదే ఇప్పుడు హైదరాబాదే రాష్ట్ర రాజధాని కాదనుకోండి, అప్పుడు ఇప్పట్లాగా అందరు హైదరాబాద్ కు ఎగబడరు, ఇప్పటికే అంత ఇంఫ్రాస్ట్రక్చర్ బాగా ఉంది కాబట్టి హైదరాబాద్ ఖర్చు భారీగా తగ్గిపోతుంది. తెలంగాణా కు ఖర్చు పెట్టాల్సిన మొత్తం 40 శాతం ఆదాయం అలానే ఉంటుంది కాబట్టి తెలంగాణ 9 జిల్లాలకు ఇప్పుదు మనం 40 శాతం రాష్ట్ర ఆదాయం ఉంది. ఇది సక్రమంగ తెలంగాణా జిల్లాల్లో ఖర్చు పెడితే తెలంగాణా ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ఆలోచించండి. ఇలా రాజధాని ని మార్చటం విన్ విన్ సిచువేషన్.

ఎలాగూ ఇన్ని మార్పులు చేస్తున్నాం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ పేరు కూడా అన్నీ ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహించేటట్లు ఏ "తెలుగు నాడు/తెలుగు దేశం" అనో లేక "తెలంగాణాంధ్రసీమ" అనో మార్చేసుకుంటే భవిష్యత్తు లో మళ్ళో కెసిఆర్ పుట్టకుండా ఉంటాడు. So ఇప్పుడు రాష్ట్రం లో ఉన్న అన్నీ సమస్యలకు పరిష్కారo "తెలంగాణాంధ్రసీమ" రాష్ట్రాన్ని "కర్నూలు/కడప/ప్రకాశం" రాజధానిగా ఏర్పాటు చేసి, ఒక తెలంగాణ వ్యక్తి ని వచ్చే 15 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిని చేసి వెనకబడిన ప్రతి జిల్లా కి ప్యాకేజీ ప్రకటిస్తే సరి.
ఇలా తెలంగాణ వారి సమస్యలు, సమైక్యాంధ్ర వారి సమస్యలు అన్నీ తీరతాయి ఈ పరిష్కార మార్గం తో. ఏమంటారు?