Thursday, December 17, 2009

చిరంజీవి అభిప్రాయం మార్చుకుంటే తప్పేంటి?

మొత్తానికి తన రాజకీయ జీవితం లో మొట్టమొదటి సారి ఒక సాహసం తో కూడిన నిర్ణయాన్ని తీసుకున్నాడు చిరంజీవి. తీవ్ర నిరసనలు ఎదురు అవుతాయని తెలిసినా, ఆంధ్రా మొత్తం లో ఎక్కువ సినిమా రెవెన్యూ కలిగిన తెలంగాణా లో తన కుటుంబం మొత్తం సినిమాలను ఆడనివ్వమంటూ ఉల్టిమేటం లు జారీ చేసి సాంపుల్ గా కొన్ని షో లు జరగకుండా ఆపినా కూడా సమైక్యాంధ్రా వైపు అడుగు వేసిన తీరు బాగుంది. ముప్ఫై యేళ్లనుంచి రాజకీయాల్లో ఉన్న పార్టీ నేతలు కూడా వేచి చూద్దాం లే అని తమ ధోరణి ఏంటో చెప్పకుండా నాన్చుతున్నప్పుడు చిరంజీవి ఒక పార్టీ అధినేత గా ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటం సమైక్య వాదులకు హర్షణీయం.

వచ్చిన చిక్కల్లా ఏంటంటే చిరంజీవి ఇంతకు ముందు "సామాజిక తెలంగాణా" అని చెప్పటం. అప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఒక్క తెలంగాణా వాదమే వినిపించింది. కెసిఆర్ లాంటి వాడితో వాదించటం పేడ మీద రాయి వెయ్యటమే అని అనుకున్నారో ఏమో కానీ పెద్దగా సమైక్య వాదులు తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లిబుచ్చలేదు అప్పట్లో. దాంతో సహజంగా ఇన్నాళ్లు నాణేనికి ఒక్క వైపే కనపడింది అందరికి. చిరంజీవి కూడా అదే గమనించి సహజం గానే తెలంగాణా కి మద్దతు ఇచ్చాడు. ఇక ఎప్పుడైతే చిదంబరం ప్రకటన వెలువడిందో సీమాoధ్రలలో పెల్లుబికిన ఆగ్రహం మాటకలందనిది. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీ లకి వెళ్ళి ఎవరు విద్యార్ధులను రెచ్చగొట్టలేదు, జిల్లా కేంద్రాలలో మీటింగ్లు పెట్టి భాగో జాగో అని పిలుపులు ఇవ్వలేదు, శాంతియుతంగా ఆమరణ దీక్ష అని పైకి చెప్తూ జరగ బోయే తీవ్ర పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ దీక్షా స్థలం వద్ద పెట్రోల్ కాన్ లు ఏర్పాట్లు చేసుకోలేదు, మా గురించి చులకనగా రాస్తే శివసేన లాగా పత్రికల మీద దాడులు చేస్తాం అని చెప్పి మీడియా ని బెదిరించి మద్దతు ఎవరూ అడగలేదు, ఇవేమీ జరగకపోయినా, ప్రకటన వచ్చి పట్టుమని పది గంటలు కాకముందే జనాలందరు రోడ్లపైకి వచ్చారు, 15 గంటల్లో సగం శాసనసభ ఖాళీ అయింది. ఇది చాలు సమైక్య ఉద్యమం తీవ్రత ని తెలపటానికి. మొత్తానికి చిరు లేటు గా అయినా లేటెస్ట్ గా ఈ దిశగా అడుగులు వేయటం నాకు తప్పుగా అనిపించట్లేదు.

ఇకపోతే విమర్శల విషయానికి వస్తే అవి చిరంజీవితో ఎప్పుడూ ఉండేవే. రాజకీయాల లోకి రానంత వరకు భయం కాబట్టి రావట్లేదని, వచ్చాక ఇంకా వెళ్లిపోవటం బెటర్ అని, సామాజిక తెలంగాణా అన్నప్పుడు వోట్లు వెయ్యని వారు కూడా ఇప్పుడు మాత్రం దిష్టి బొమ్మ దగ్ధం చేయటం, సామాజిక తెలంగాణా అన్నప్పుడు తిట్టుకున్న ఆంధ్రా వాళ్ళు ఇప్పుడు హర్షించటం మానేసి మాట మార్చాడని మళ్ళీ తిట్టడం ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే.

ఇప్పుడు చిరు చేయాల్సింది ఒక్కటే. సమైక్యంగా ఉంటూ కూడా సామాజిక తెలంగాణా సాధించొచ్చు అని తెలంగాణా ప్రజలకు సమైక్యాంధ్ర మీద నమ్మకం కలిగించాల్సి ఉంది. దానిలో ఉండే లాభాలు, విడిపోతే వచ్చే కష్టాలు వివరించాలి. తెరాస లాగా ఆరోపణలతో కాకుండా ఫాక్ట్స్ (నిజానిజాల) తో ప్రజల ముందుకు వెళ్లాలి. తెలంగాణా ప్రజలు అభివృద్ధి జరగలేదు కాబట్టి ప్రత్యేక రాష్ట్రం ఐతే అభివృధి జరుగుతుంది అని కోరుకుంటున్నారు, కానీ అంతకన్నా ఎక్కువ అభివృద్ధి సమైక్యంగా ఉంటే జరిగే అవకాశం ఉంది అలా జరిగింది కూడా (ఉదా: హైదరాబాదు) అని చెప్పటమే కాకుండా సభ లో తెలంగాణా వాణి ని వినిపించాలి, తెలంగాణా అభివృద్ధి కోసం పాటు పడాలి.

మరి ఈ విషయం సొంత తెలంగాణా MLA లకు కూడా చెప్పలేకపోయాడు మరి తెలంగాణ ప్రజలకు చెప్తాడో లేదో, చెప్తే వాళ్ళు వింటారో వినరో...

Sunday, December 13, 2009

పచ్చని కాపురం లో చిచ్చు పెట్టిన కెసిఆర్

చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతు, లక్ష కోట్ల బడ్జెట్ తో దేశం లోనే అతి పెద్ద రాష్ట్రం గా ముందుకు వెళ్తున్న రాష్ట్రంలో తన సొంత రాజకీయ భవిష్యత్తు కోసం రాష్ట్రాన్నే అగ్నిగుండం గా మార్చేశాడు కెసిఆర్. పొత్తు పెట్టుకోని కూడా పట్టుమని పది సీట్లు గెలవలేని వీ(రు)డు ఇంక భవిష్యత్తు అంధకారమే కానున్న తరుణo లో ఏదో ఒకటి చేసి పూర్వ వైభవం తేవటం కోసం రాష్ట్రాన్నే పణంగా పెట్టాడు.

దీనికోసం వీడు వేయని ఎత్తు లేదు. యూనివర్సిటీలకు వెళ్ళి మీకు ప్రభుత్వోద్యోగాలు రాక పోవటానికి కారణం ఆంధ్రా వాళ్ళు అని రెచ్చగొట్టాడు. అసలు ఒక రాజకీయ నాయకుడికి పాపం పుణ్యం లేకుండా విద్యార్ధులు చదువుకొనే యూనివర్సిటీలల్లో రాజకీయ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అయినా ఈ రోజుల్లో ప్రభుత్వోద్యోగాలు ఎన్నున్నాయి? ఎంత మందికి వస్తున్నాయి అని ఆలోచించే విచక్షణ కూడా లేదా యూనివర్సిటీ విద్యార్ధులకు? ఒక వేళ తెలంగాణా వస్తే వీళ్లందరికి ఉద్యోగాలు వస్తాయి అని కెసిఆర్ గారెంటీ ఇస్తాడా?
ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగు మాట్లాడే వాళ్లందరి ప్రతీకగా తెలుగు తల్లి విగ్రహాన్ని తయారు చేసుకుంటే దానికి తెలంగాణా ఉద్యమానికి సంబంధం ఏంటి? బుద్ధున్న వాడు ఎవడైనా ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తాడా? పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేయటం ఎంత వరకు సబబు?

పాపం తెలుగు వాళ్ళ రాష్ట్రం ఏర్పడుతుంది కదా అని తమ సొంత రాజధానినే త్యాగం చేశారు సీమ వాసులు. కర్నూల్ రాజధానిగా కొనసాగి ఉంటే కర్నూల్ ఈ యాభై యేళ్లలో ఎంతలా అభివృద్ధి చెంది ఉండేది? హైదరాబాదు మన అందరి రాజధాని అనే కదా అందరూ అక్కడ పెట్టుబడులు పెట్టింది? హైదరాబాదు ఒక్క తెలంగాణా రాజధాని అయ్యుంటే అన్నీ పెట్టుబదులు వచ్చి ఉండేవేనా? 50 సంవత్సరాల క్రితమే విజయవాడ అన్నీ విషయాల్లో హైదరాబాదు కి సరి సమానంగా ఉండేది. అలాంటి విజయవాడ కి ఈ యాభై సంవత్సరాలలో ఎన్ని కంపనీలు వచ్చాయి? ఎంత అభివృధి జరిగింది?

రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మధ్య తరగతి సాఫ్ట్వేర్, ఫార్మా ఏంజనీర్లు, ఇతర ఉద్యోగులు, వ్యాపారులు 20 సంవత్సరాల హోంలోన్ అంటే సగం జీవితం సంపాదన పెట్టి హైదరాబాద్ లో ఇళ్లు కొంటున్నారు. అలా వచ్చిన డబ్బు వల్ల రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో అర ఎకరం పొలం ఉన్న వాళ్ళు కూడా కోటీశ్వరులయ్యి వాళ్ళ పిల్లల్ను ఇంటెర్నేషనల్ స్కూళ్లలో చదివిస్తూ స్కార్పియో లలో తిరుగుతున్నారు. ఇలాంటి ఉదాహరణలు కోస్తాంధ్ర, రాయలసీమ లో ఉన్నాయా? ఇలా జీవితాంతం సంపాదించుకొనే డబ్బుని హైదరాబాద్ కు దోచిపెడుతుంటే, సెట్లర్స్ దోచుకుంటున్నారు అని ప్రచారం చేశాడు కెసిఆర్. ఇంతకన్నా అబద్ధం ఇంకోటి ఉంటుందా? ఆమాటకొస్తే అసలు సెట్లెర్ కి నిర్వచనం ఏంటి? పక్క ప్రాంతం నుంచి వచ్చిన వాడా? పక్క ఊరి నుంచి వచ్చిన వాడా? లేక పక్క జిల్లా నుంచి వచ్చిన వాడా? హైదరాబాద్ లో 400 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు తెలంగాణా వాళ్ళు కూడా సెట్లర్స్ అని వాళ్లు కూడా హైదరాబాద్ ని దోచుకుంటున్నారు అంటే పరిస్థితి ఏంటి?

ఇక పోతే ఆంధ్రా వలస పాలకులు మనల్ని పాలిస్తున్నారు అని చేసిన ప్రచారం ఇంకోటి. తెలంగాణ నుంచి కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, దేశానికి ప్రధాన మంత్రులు అయ్యారు కదా. మరి ఆప్పుడు మిగతా ప్రాంతాల వాళ్ళు అలానే అనుకున్నారా? వాళ్ళకి అది ఆత్మ గౌరవ సమస్య అయిందా? తెలంగాణా లో నీటి ప్రాజెక్టులు లేవు అంటే తెలంగాణా వాళ్ళు ముఖ్యమంత్రులు అయినా కూడా కట్టలేదు కదా...మరి ఇది తెలంగాణా వాళ్ళ తప్పా లేక ఆంధ్రా వాళ్ళ తప్పా? తెలంగాణా కి జరిగిన మేలు ని గురించి ఎందుకు చెప్పరు ఈ పార్టీ వాళ్ళు? ప్రతిష్టాత్మక ఐఐటి, ఇఎస్ బి, ఎన్ ఐ టి లు తెలంగాణా లో మాత్రమే ఉన్నాయి. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, రెడ్డీస్, భెల్, సింగరేణి, మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ, అంతర్జాతీయ విమానాశ్రయం ఇలా ఎన్నో తెలంగాణా లో ఉన్నాయి. వీటి వల్ల ఎంతో మంది తెలంగాణా వారికి మేలు జరుగుతుంది. ఇవన్నీ మర్చిపోయి నాణానికి ఒక వైపు మాత్రమే చూపించి జనాలను మభ్యపెడుతున్నాడు కెసిఆర్. విచిత్రం ఏంటంటే మిగతా అన్నీ పార్టీలు కూడా ఈ అవకాశ వాదానికి మద్దతు ఇవ్వటం.

తెలంగాణా వెనకాపడి ఉంటే దానికి కారణం అక్కడ ఉన్న రాజకీయ నాయకులు, దానికి విరుగుడు ప్రత్యేక రాష్ట్రం ఎంత మాత్రం కాదు. ప్రత్యేక రాష్ట్రం రాగానే తెలంగాణా లో ఉన్న ఇబ్బందులు అన్నీ పోతాయనుకుంటే అంత కన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. అసలు కెసిఆర్ కి ప్రత్యేక రాష్ట్రం వచ్చాక అబివృద్ధి ఎలా చేయాలి అన్న దానికి మీద కొంచెం అవగాహన అన్నా ఉందా?
ఇక పోతే ఈ చిచ్చు లో కెసిఆర్ తర్వాత పెద్ద విలన్ మీడియా. ఒకటే సంఘటన ని పదే పదే రెవైండ్ చేస్తూ మరీ చూపిస్తూ సామాన్య జనానికి పిచ్చి ఎక్కుస్తున్నారు. వీళ్లకి కెసిఆర్, టిఆర్ఎస్ వాళ్ళు ఏడి చెప్పినా సెన్సేషనే, ఆ రోజంతా అదే వేస్తుంటారు అదేంటో మరి. మొత్తానికి ఆమరణ నిరాహార దీక్షకి కొత్త భాష్యం చెప్పి తాను సాధించాలనుకున్నది సాధించాడు ఈ కెసిఆర్. తన రాజకీయ మనుగడ కోసం తెలుగు ప్రజల మధ్య ఇప్పటివరకూ లేని స్పర్ధలు సృష్టించాడు. కెసిఆర్ లాంటి ఒక్క రాజకీయ నాయకుడుంటే ఇంకా రాష్ట్రానికి వేరే సమస్యలక్కర్లేదు. నిన్న టిజీ వెంకటేష్ చెప్పినట్లు కెసిఆర్ ఆమరణ దీక్ష చేసినా, లగడపాటి చేసినా వాళ్ళిద్దరికి ఏమీ కాదు, మధ్యలో అమాయకపు ప్రజలే బలి అవుతారు. ఇంకేముంది తెలుగు ప్రజలు తన్నుకు చావండి, అన్నెం పున్నెం ఎరుగని బస్సులను తగలబెట్టండి, దాడులు చేయండి, తెలుగు జాతినే నాశనం చేయండి.