Thursday, December 17, 2009

చిరంజీవి అభిప్రాయం మార్చుకుంటే తప్పేంటి?

మొత్తానికి తన రాజకీయ జీవితం లో మొట్టమొదటి సారి ఒక సాహసం తో కూడిన నిర్ణయాన్ని తీసుకున్నాడు చిరంజీవి. తీవ్ర నిరసనలు ఎదురు అవుతాయని తెలిసినా, ఆంధ్రా మొత్తం లో ఎక్కువ సినిమా రెవెన్యూ కలిగిన తెలంగాణా లో తన కుటుంబం మొత్తం సినిమాలను ఆడనివ్వమంటూ ఉల్టిమేటం లు జారీ చేసి సాంపుల్ గా కొన్ని షో లు జరగకుండా ఆపినా కూడా సమైక్యాంధ్రా వైపు అడుగు వేసిన తీరు బాగుంది. ముప్ఫై యేళ్లనుంచి రాజకీయాల్లో ఉన్న పార్టీ నేతలు కూడా వేచి చూద్దాం లే అని తమ ధోరణి ఏంటో చెప్పకుండా నాన్చుతున్నప్పుడు చిరంజీవి ఒక పార్టీ అధినేత గా ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటం సమైక్య వాదులకు హర్షణీయం.

వచ్చిన చిక్కల్లా ఏంటంటే చిరంజీవి ఇంతకు ముందు "సామాజిక తెలంగాణా" అని చెప్పటం. అప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఒక్క తెలంగాణా వాదమే వినిపించింది. కెసిఆర్ లాంటి వాడితో వాదించటం పేడ మీద రాయి వెయ్యటమే అని అనుకున్నారో ఏమో కానీ పెద్దగా సమైక్య వాదులు తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లిబుచ్చలేదు అప్పట్లో. దాంతో సహజంగా ఇన్నాళ్లు నాణేనికి ఒక్క వైపే కనపడింది అందరికి. చిరంజీవి కూడా అదే గమనించి సహజం గానే తెలంగాణా కి మద్దతు ఇచ్చాడు. ఇక ఎప్పుడైతే చిదంబరం ప్రకటన వెలువడిందో సీమాoధ్రలలో పెల్లుబికిన ఆగ్రహం మాటకలందనిది. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీ లకి వెళ్ళి ఎవరు విద్యార్ధులను రెచ్చగొట్టలేదు, జిల్లా కేంద్రాలలో మీటింగ్లు పెట్టి భాగో జాగో అని పిలుపులు ఇవ్వలేదు, శాంతియుతంగా ఆమరణ దీక్ష అని పైకి చెప్తూ జరగ బోయే తీవ్ర పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ దీక్షా స్థలం వద్ద పెట్రోల్ కాన్ లు ఏర్పాట్లు చేసుకోలేదు, మా గురించి చులకనగా రాస్తే శివసేన లాగా పత్రికల మీద దాడులు చేస్తాం అని చెప్పి మీడియా ని బెదిరించి మద్దతు ఎవరూ అడగలేదు, ఇవేమీ జరగకపోయినా, ప్రకటన వచ్చి పట్టుమని పది గంటలు కాకముందే జనాలందరు రోడ్లపైకి వచ్చారు, 15 గంటల్లో సగం శాసనసభ ఖాళీ అయింది. ఇది చాలు సమైక్య ఉద్యమం తీవ్రత ని తెలపటానికి. మొత్తానికి చిరు లేటు గా అయినా లేటెస్ట్ గా ఈ దిశగా అడుగులు వేయటం నాకు తప్పుగా అనిపించట్లేదు.

ఇకపోతే విమర్శల విషయానికి వస్తే అవి చిరంజీవితో ఎప్పుడూ ఉండేవే. రాజకీయాల లోకి రానంత వరకు భయం కాబట్టి రావట్లేదని, వచ్చాక ఇంకా వెళ్లిపోవటం బెటర్ అని, సామాజిక తెలంగాణా అన్నప్పుడు వోట్లు వెయ్యని వారు కూడా ఇప్పుడు మాత్రం దిష్టి బొమ్మ దగ్ధం చేయటం, సామాజిక తెలంగాణా అన్నప్పుడు తిట్టుకున్న ఆంధ్రా వాళ్ళు ఇప్పుడు హర్షించటం మానేసి మాట మార్చాడని మళ్ళీ తిట్టడం ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే.

ఇప్పుడు చిరు చేయాల్సింది ఒక్కటే. సమైక్యంగా ఉంటూ కూడా సామాజిక తెలంగాణా సాధించొచ్చు అని తెలంగాణా ప్రజలకు సమైక్యాంధ్ర మీద నమ్మకం కలిగించాల్సి ఉంది. దానిలో ఉండే లాభాలు, విడిపోతే వచ్చే కష్టాలు వివరించాలి. తెరాస లాగా ఆరోపణలతో కాకుండా ఫాక్ట్స్ (నిజానిజాల) తో ప్రజల ముందుకు వెళ్లాలి. తెలంగాణా ప్రజలు అభివృద్ధి జరగలేదు కాబట్టి ప్రత్యేక రాష్ట్రం ఐతే అభివృధి జరుగుతుంది అని కోరుకుంటున్నారు, కానీ అంతకన్నా ఎక్కువ అభివృద్ధి సమైక్యంగా ఉంటే జరిగే అవకాశం ఉంది అలా జరిగింది కూడా (ఉదా: హైదరాబాదు) అని చెప్పటమే కాకుండా సభ లో తెలంగాణా వాణి ని వినిపించాలి, తెలంగాణా అభివృద్ధి కోసం పాటు పడాలి.

మరి ఈ విషయం సొంత తెలంగాణా MLA లకు కూడా చెప్పలేకపోయాడు మరి తెలంగాణ ప్రజలకు చెప్తాడో లేదో, చెప్తే వాళ్ళు వింటారో వినరో...

9 comments:

nuvvusetty said...

"ఇప్పుడు చిరు చేయాల్సింది ఒక్కటే. సమైక్యంగా ఉంటూ కూడా సామాజిక తెలంగాణా సాధించొచ్చు అని తెలంగాణా ప్రజలకు సమైక్యాంధ్ర మీద నమ్మకం కలిగించాల్సి ఉంది."

---చాలామంచి సూచన ఇచ్చారు. భేష్.

నాగప్రసాద్ said...

చిరంజీవి ఇప్పటికైనా ఏదో ఒక నిర్ణయానికొచ్చాడు. సంతోషం.

Anonymous said...

chiranjeevi is a power monger & has kula gajji.he is an insult to politics .i hope people remember this at election time.by the way,the revenue for movies from non telangana areas is much larger than telangana revenue.

Unknown said...

చిరంజీవి అభిప్రాయం మార్చుకున్నా తప్పు లేదు.....
దుకాణం ఎత్తేసినా తప్పు లేదు......!
మొదటి దాని కంటే రెండోదే బెటర్.
మొదటిది ఆయనను రెంటికి రేవడిని చేసే ప్రమాదం వుంది.
తెలంగాణా ప్రజలకు మాత్రం దరిద్రం వదిలినంత సంతోషంగా వుంది.
ఇప్పుడు జగన్, చంద్ర బాబు నాయుడు వగైరా ఎ ఆంద్ర రాజకీయ నాయకుడి మీదా భ్రమలు లేకుండా పీడా పోయింది.
జై తెలంగాణా!

Nrahamthulla said...

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.

Anonymous said...

బాగుంది ద్విపాత్రాభినయం.

శరత్ కాలమ్ said...

ఎవరయినా, ఎన్నిసార్లయినా దేశకాలమాన పరిస్థితులని బట్టి నిర్ణయం మార్చుకోవచ్చు. నిర్ణయాలన్నవి/నిర్ణయాలున్నవి మార్చుకోవడానికే కదా. చిరంజీవి ప్రస్తుత నిర్ణయం బావుంది.

నిజం said...

శరత్ కూడా తన నిర్ణయాన్ని marchukunTaDani ఆశిద్దాం

శరత్ కాలమ్ said...

@ నిజం
:)

Left + Left + Left = Right!