Friday, October 3, 2008

సామాను తిరిగి పొందు 'స్దలము'

ఏoటి వీడెవడో బ్లాగు హెడ్డింగ్ కూడా తప్పు రాశాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఒప్పుకోరా? ఐతే కింద ఫొటో చూడండి.




ఇంకా అర్థం కాకపోతే పై ఫొటో బూతద్దం లో ఎలా ఉంటుందో కింద చూడండి.



మీకీపాటికి అర్థం అయ్యుంటుంది. ఇదేదో విమానాశ్రయ౦ లో బోర్డు లాగా ఉందే అని. అవును ... మీరు అనుకున్నట్లు ఇది మన హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం లోని ఒక బోర్డే. ఇలాంటి బోర్డులు అక్కడ వెతకటానికి పెద్ద సమయం పట్టదు. ఎందుకంటే అక్కడ తొంభై శాతం బోర్డుల్లో తెలుగు అలానే ఉంటుంది. చదువు, వృత్తి రీత్యా ఆరు సంవత్సరాలుగా అంధ్రా బైట ఉంటున్న నాకు సాధారణంగా ఎప్పుడైనా ఆంధ్రా లో అడుగు పెట్టగానే నా చూపు అంతా తెలుగు అక్షరాలపైకి వెళుతుంది. ఇలా ఒక బోర్డు కనపడగానే ఒక్కచోటన్నా తప్పు లేకుండా ఉంటుందేమోనని ఇంకో పది బోర్డులు వెతికినా 'స్థలము' అనే పదం ఒక్క చోట కూడా సరిగ్గా రాసిలేదు. ఎంటో ఆ మాత్రం తెలుగు రాసే వాడు కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన హైదరాబాదులో లేరా అనిపించింది. ఇక విమానాశ్రయం లో విమాన వివరాలు/గమనికలు తెలుగు లో అసలు ఉండనే ఉండవు. అంతర్జాతీయ విమానాశ్రయం లోనికి తెలుగు మాత్రమే వచ్చిన వాళ్లు అసలు ప్రవేశించటానికే అనర్హులు అని మన పాలకుల అభిప్రాయం కాబోలు. ఇలా ఒక రాష్ట్ర రాజధానిలో ఉండే ఒక విమానాశ్రయం లో ఆ రాష్ట్ర భాష లో గమనికలు లేక పోవటం బహుశా ప్రపంచం లో ఇక్కడే ఉండి ఉంటుంది. అంత (దుర+)అదృష్టం మనకే దక్కుతుంది.

ఇక ఈ విమానాశ్రయం గురించి అప్పట్లో జరిగిన ఏకైక చర్చ విమానాశ్రయం పేరు మీద. ఒక తెలుగు వాడిగా తెలుగు వాడి పేరు పెడితే నేను కుడా బాగా అనందిస్తాను. అది ఒక రకమైన ఆత్మగౌరవం లాంటిది. సరే అది ఎలాగు జరగలేదు కదా కనీసం విమానాశ్రయం లోపల అన్నా తెలుగు అమలు పరిస్తే బాగుంటుంది. మన ప్రభుత్వానికి ఇలాంటివి ఎలాగు పట్టవు. తెలుగు వాళ్ల "ఆత్మ గౌరవం" నినాదం వాడుకొనే "తెలుగు దేశం" వాళ్లకి గాని, కనీసం అధికార భాషా సంఘం వాళ్లకి గాని ఏమన్నా పడతాయంటారా ఇలాంటి విషయాలు?

4 comments:

Rajendra Devarapalli said...

సదరు శంషాబాద్ విమానాశ్రయాన్ని ఉపయోగించుకుంటున్న వారూ,ఉపయోగించుకోనున్న వారు తమతమ సలహాలు,సూచనలు ఈ లంకెద్వారా పంపితే ఉపయోగకరం కదా అందరకూ?


http://shamshabadairport.com/forums/

Ramani Rao said...

మన తెలుగు ప్రజలకొచ్చిన తెగులే నండీ ఇది. అక్కడ ఇక్కడ అని ఏమి లేదు, మన హైద్రాబాద్ లో ఎక్కడ చూసినా ఇలాంటి అచ్చు తప్పుల ప్రకటనలు కోకొల్లలు.

shaneer babu said...

పుల్లాయనగారూ...భలే పట్టారండీ...మీతో జాగ్రత్తగా వుండాలి సుమీ...

చిన్నమయ్య said...

తప్పే, కానీ అందులో అంత "బూతు" ఏవీ లేదు గదా? మొదటి ఫొటో కింద బూతద్దం = భూతద్దం.