Wednesday, March 18, 2009

'మెగాస్టార్' ఈ ఇబ్బందులను అధిగమించగలడా?

దాదాపు గా ఒక ఇరవై ఏళ్ళు గా సినిమా రంగం లో రారాజు చిరంజీవి. అట్టడుగు స్థాయి నుంచి అత్యంత ఎత్తుకి ఎదిగాడు తన పట్టుదల, కృషి తో. కోట్లల్లో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ అభిమానమే ఆస్తి గా రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. పార్టీ ఏర్పడిన మొదట్లో అంతా సజావుగానే జరిగినా గత కొద్ది కాలంగా ఎక్కువగా 'చిరు' కి రాజకీయం ఎంత కుట్ర కుతంత్రాలతో కూడిందో అర్థం అవుతూ ఉండి ఉంటుంది. సినిమాల్లో అరంగేట్రం చేసినప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తేలేదు కాని, ఇప్పుడు మాత్రం చాలా ఎదురు దెబ్బలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇందులో మొదటిది, అతి ముఖ్యమైన ఇబ్బంది వార్తా పతికలు, మీడియా మద్దతు లేకపోవటం. వాళ్ల మద్దతు లేక పోగా ఏదో ఒక రకంగా చిరు పేరుని మాత్రం వాళ్ల స్వార్ధాలకోసం వాడుకుంటున్నారు. వాట్లో మొదటగా చెప్పాల్సింది 'ఈనాడు' గురించి. ఎప్పుడైతే సాక్షి తక్కువ డబ్బులతో ఎక్కువ ఫీచర్స్ ఇచ్చి ఈనాడు సర్కులేషన్ తగ్గించిందో అప్పుడు ఈనాడు కి అప్పుడప్పుడే రాజాకియాల్లోకి దూసుకు వస్తున్న చిరంజీవి ఒక బ్రహ్మాస్త్రంలా కనిపించాడు. అదే తడుముగా తన చిరకాల మిత్రుడైన రాముడి పార్టీ ని పక్కన పెట్టి, ఆంజనేయుడి పార్టీ కి ఒక రేంజ్ లో మద్దతు పలికాడు. అది ఎంత వరకు వెళ్లిందంటే చిరు వేసుకున్న చొక్కా రంగు నుంచి, పెట్టుకున్న వాచ్ నుంచి, మొహం మీద ఎంత శాతం చిరునవ్వు ఉందో, ఎన్ని గంటల ఎన్ని సెకన్ల ఎన్ని మిల్లీ సెకన్లకి ఉపన్యాసం ఇచ్చాడో అన్నిటినీ వర్ణిస్తూ కథనాలు రాయసాగాడు. అలా అభిమానులను ఈనాడు చదివించేలా ఆకట్టుకొని తన కష్ట సమయాల్లో గట్టెక్కాడు. ఎప్పుడైతే సాక్షి సర్కులేషన్ తగ్గటం మొదలు పెట్టిందో మళ్లీ చిరు ని పక్కన పెట్టి ఎప్పటిలాగానే తెదేపా ని అందలం ఎక్కించటం మొదలు పెట్టాడు. ఇక ఇప్పుడు చిరు గురించి ఈనాడు లో ఎక్కువగా రాసే అంశాలు "ప్రరాపా కమిటీ మీటింగ్ లో కార్యకర్తలు కొట్టుకున్నారు" అనో లేక ప్రరాపా అజెండా గురించి ఎవరో చేసిన విమర్శనో రాస్తాడు. మంచి విషయాలని ఏ మూలో ఎవరూ చదవని పేజీ లో రాస్తాడు. ఇక సాక్షి విషయానికి వస్తే మొదటి నుంచి ఒకే తీరు: కాంగ్రెస్స్ని తప్ప మిగతా పార్టీ లను విమర్శించటమే. మొదట చిరు ని విమర్శిస్తే అభిమానులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవటానికి "పొలిటికల్ గాసిప్' 'కాలం' లో అన్నీ చిరు గురించి నెగెటివ్ గా రాసేవాడు. చిన్నగా అభిమానులు ఆ విమర్శలకు సెట్ అయ్యాక అవే ముఖ్య వార్తల్లో రాయటం మొదలు పెట్టాడు. ఇక అంధ్రజ్యోతి, వార్త, సూర్య కి కూడా వాటి వాటి పార్టీలు ఉండనే ఉన్నాయి. ఇలా చిరు కి యే ఒక్క పత్రిక మద్దతు కూడా లేదు.
ఇక టీవీల విషయానికి వస్తే వీళ్లకి కావల్సింది సెన్సేషనల్ న్యూస్ మాత్రమే, నిజానిజాలు ఎంత మాత్రం కావు. రోజా, జీవిత, రాజశేఖర్ వీళ్ల పాలిట దేవుళ్లు. వాళ్లు యే చౌక బారు విమర్శ చేసినా "ఫ్లాష్...ఫ్లాష్..." అంటూ రోలర్స్ వేస్తారు. ఆ రోజంతా వాళ్లందరి తోటి పదే పదే ఇంటర్వ్యూ లు పెట్టి, వింత వింత చర్చలు పెట్టి పండగ చేసుకుంటారు. మనకు తెలియకుండానే చిరంజీవి గురించి నెగెటివ్ అభిప్రాయం వచ్చేలా చేస్తారు. టీవీ 9/5, ఎన్ టీవీ ఈ కోవ లోకి వస్తాయి.
ఇక పోతే మిగతా పార్టీ ల రాజకీయ నాయకులు: వీళ్లకి కావల్సింది ఎదో ఒక విధంగా ఆయా పార్టీల అధినేత కళ్లల్లో పడటం, పార్టీలో తమ స్థాయిని పెంచుకోవటం. ఇక వీళ్లకి కూడా ఆయుధం చిరంజీవే. చిరంజీవి ని "శని నాయకుడు" అనో లేక పోతే బ్లడ్ బాంక్ లో రక్తం అమ్ముకున్నాడనో అంటేనే వీళ్ల పేర్లు పత్రికల్లో వస్తాయి, ముఖాలు టీవీల్లో కనిపిస్తాయి. రోజా, మారెప్ప లాంటి వాళ్లు ఈ కోవ కి చెందిన వాళ్లు. పదే పదే ఒకళ్లనే లక్ష్యం గా చేసుకొని విమర్శించి అవతలి వాళ్లని రెచ్చగొట్టటం వీళ్ల ఏకైక లక్ష్యం.
ఇక "ప్రరాపా" లో టికెట్ ఆశించి చేరేవాళ్లది ఇంకో కోవ. టికెట్ రాదు అని కన్ ఫర్మ్ అయ్యాక "ప్రజా రాజ్యం లో సామాజిక న్యాయం జరగట్లేదు" అనో లేక "టికెట్ కి దబ్బులు అడుగుతున్నాడు" అనో ఒక విలేఖరుల సమావేశం పెడతారు. అన్ని టీవీ చానెల్స్ దాన్ని లైవ్ ప్రసారం చేస్తాయి. వీళ్లందరూ కాక కోవర్టులు ఇంకా ఉండనే ఉన్నారు.
ఇక అభిమానులు కూడా చిరంజీవిని వదలలేదు. రాజశేఖర్ మీద దాడి ఇందుకు సరైన ఉదాహరణ. చిరంజీవి ద్రుష్టి లో పడాలని వాళ్లు అలా చేశారు. దాని వల్ల చిరంజీవికి, అభిమానులకీ ఎంత చెడ్డ పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే.
చివరికి ఎన్నికల సంఘానిది కూడా అదే తీరు. రాష్ట్రం లో ఉన్న వోటర్లలో పది శాతం మంది సభ్యత్వం ఉన్న పార్టీ కి ఒక ఉమ్మడి గుర్తు కేటాయించాలంటే వాళ్లకి ఇబ్బందంట. అదే 294 అభ్యర్ధులకు 294 గుర్తులు కేటాయించటం మాత్రం వాళ్లకి తేలికంట.
ఇలా వ్యవస్థ లో ఉన్న ప్రతి ఒక్కరు ఇలా 'చిరు' పేరు ను తమ తమ స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారు. చిరు కి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇంతకు ముందు కూడా చాలా సినిమాల్లో డైలాగ్స్ లో మెగాస్టార్ పేరు పెడితే ఫాన్స్ అన్నా చూస్తారనే ఉద్దేశం తో 'చిరు' మీద ఒకట్రెండు డైలాగ్స్ పెట్టారు. అయితే వీటివల్ల చిరు కి వచ్చిన నష్టం ఏమి లేదు. కానీ ఇప్పుడు పత్రికలు మొదలు కొని టీవీ చానెల్స్, రాజకీయ నాయకులు, చివరికి అభిమానులు కూడా ఆ పేరు ని ఎక్స్ ప్లాయిట్ చేస్తున్నారు. చిరంజీవి కి తల నెప్పి తీసుకువస్తున్నారు.
కర్ణుడి చావు కి కారణాలు అనేకం అన్నట్లు ఇవన్నీ చిరంజీవి ఓటమి కి కారణం అవుతాయో లేక సినిమాల్లో లాగా వీటన్నిటినీ తట్టుకొని చిరంజీవి విజయం సాధిస్తాడో తెలుసుకోవాలంటే ఎన్నికలయ్యేదాకా ఆగాల్సిందే.

6 comments:

Anonymous said...

చాలా బాగా విశ్లేషించారు. నా అభిప్రాయంలో చిరంజీవి ఎక్కడ విఫలమయ్యారంటే...పార్టీ నిర్మాణంలో. ఆయనకు సేవ చేద్దామని మంచి సంకల్పం, చిత్తశుద్ధి ఉండగానే సరిపోదు. దానికి తగినట్లుగా వ్యవస్థను నిర్మించుకోవాలి. అది జరగలేదు. మరి ఇది ఆయన వైఫల్యమే కదా. Ofcourse...రాజకీయాలు ఆయనకు కొత్తే కావచ్చు. కానీ అలాంటప్పుడు మంచి టీమ్ ను తీసుకోవాలి. వారితో పని చేయించుకోవాలి. దానికి తోడు ఆయనకు తన బలం ఏమిటో కూడా తనకు తెలియదు. అపూర్వమయిన wave ఉన్నా దానిని అనుకూలంగా మలుచుకోలేకపోతున్నారు. ఆత్మవిశ్వాసం లేదు. పార్టీ పెడుతున్నారన్న timeకి,ఇప్పటికీ ఆయన మీద, ఆయన పార్టీ మీద ఉన్న expectations, hopes తగ్గుతున్నాయి. అది ఇంకా తగ్గకుండా చూసుకుంటే కొంతలో కొంత మేలు.

పుల్లాయన said...

ssbab gaaru,
మీ స్పందన కి ధన్యవాదాలు.
మీరు అన్నట్లు హోప్, ఎక్స్పెక్టేషన్ తగ్గటం మీడియా సృష్టే అని నా అభిప్రాయం. రోడ్ షో లలో జనాలని చూస్తేనే ఆ విషయం అర్థం అవుతుంది. యంత్రాంగం, వ్యవస్థ నిర్మించటానికి సమయం కావాలి. అది వాళ్ల దగ్గర లేదు. కనీసం వేరే పార్టీల వాళ్లని చేర్చుకొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సింది.

pseudosecular said...

బాగానె వ్రాసారు కాని. He is playing dangerous game to get votes of Muslims and Christians.

1. He took national flag and mutilated it and adopted it as his party flag. He removed kaashaayam color and added red. And enhanced green and white. Do you know the meanig of those colors?

2. He claims that he is a practicing Hindus. But he talk about Waqf and Madarsa lands. It is shame that he did not know about the plight of Hindu Temples and looting of Hindu Temples and Temples lands by government.

3. He is waring Muslim dress quite often to show that he is in favor of Muslims. But Muslims know that Chiranjeevi is after their votes, so they are bargaining hard to get goodies from him. And the story is same with Christians.

4. Did he ver talk about issues of Hindus? no. Did he ever talk about abolishment of Caste System and unification Hindus? No. Is it not role of successful people like him to lead Hindus? If not he has not right to ask votes from any Hindu.

5. Educated Hindus are watching him and his appeasment for Muslims and Christians for votes.

6. He has no experience in public administration. He should gain some experience by joing some other party for five years, then he should have started his own party. Else his brother-in-law and his brothers will run the show fro behind.

7. So far he failed to show any leadership qualities.

8. He is dividing Hindus beased on Caste lines.

9. He can be a CM material after five years( he needs prior experience).

Anonymous said...

@ pseudosecular
చాలా బాగా విశ్లేషించారు. నేను కూడా అదేఅభిప్రయంతో వున్నాను.

Anil Dasari said...

>> "చివరికి ఎన్నికల సంఘానిది కూడా అదే తీరు"

చిరంజీవికి ఉమ్మడి గుర్తు విషయంలో సమస్యలు ఎదురవటం విచారకరమే కానీ ఎన్నికల సంఘం నియమాలు అలా ఉన్నాయి. వాళ్లు కావాలని చేసిందేమీ లేదు. మరిన్ని వివరాలకు నేటి (Feb 18th) ఈనాడు లో 'వ్యాఖ్యానం' శీర్షికలో మాడభూషి శ్రీధర్ రాసిన వ్యాసం చదవండి.

Anonymous said...

చిరంజీవి అధికారంలోకి రాలేడేమోననే సందేహం మీకూ కలిగినట్టుగా ధ్వనిస్తోంది. ఒక అభిమానిగా అది బాధ కలిగించేదే! అయితే.. ఈనాడు ఇప్పుడు చిరంజీవిని పట్టించుకోవడం లేదు అనేది మాత్రం సరైనది కాదు. చిరంజీవి పర్యటన విశేషాలు రోజూ ప్రధాన వార్తే ఈనాడులో, తోడుగా ఒక పెద్ద ఫోటోతో! మీరన్నట్టు ఈనాడు చిరంజీవిని పక్కనపెట్టినట్టు అనిపించడంలా నాకు.