Thursday, December 17, 2009

చిరంజీవి అభిప్రాయం మార్చుకుంటే తప్పేంటి?

మొత్తానికి తన రాజకీయ జీవితం లో మొట్టమొదటి సారి ఒక సాహసం తో కూడిన నిర్ణయాన్ని తీసుకున్నాడు చిరంజీవి. తీవ్ర నిరసనలు ఎదురు అవుతాయని తెలిసినా, ఆంధ్రా మొత్తం లో ఎక్కువ సినిమా రెవెన్యూ కలిగిన తెలంగాణా లో తన కుటుంబం మొత్తం సినిమాలను ఆడనివ్వమంటూ ఉల్టిమేటం లు జారీ చేసి సాంపుల్ గా కొన్ని షో లు జరగకుండా ఆపినా కూడా సమైక్యాంధ్రా వైపు అడుగు వేసిన తీరు బాగుంది. ముప్ఫై యేళ్లనుంచి రాజకీయాల్లో ఉన్న పార్టీ నేతలు కూడా వేచి చూద్దాం లే అని తమ ధోరణి ఏంటో చెప్పకుండా నాన్చుతున్నప్పుడు చిరంజీవి ఒక పార్టీ అధినేత గా ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటం సమైక్య వాదులకు హర్షణీయం.

వచ్చిన చిక్కల్లా ఏంటంటే చిరంజీవి ఇంతకు ముందు "సామాజిక తెలంగాణా" అని చెప్పటం. అప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఒక్క తెలంగాణా వాదమే వినిపించింది. కెసిఆర్ లాంటి వాడితో వాదించటం పేడ మీద రాయి వెయ్యటమే అని అనుకున్నారో ఏమో కానీ పెద్దగా సమైక్య వాదులు తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లిబుచ్చలేదు అప్పట్లో. దాంతో సహజంగా ఇన్నాళ్లు నాణేనికి ఒక్క వైపే కనపడింది అందరికి. చిరంజీవి కూడా అదే గమనించి సహజం గానే తెలంగాణా కి మద్దతు ఇచ్చాడు. ఇక ఎప్పుడైతే చిదంబరం ప్రకటన వెలువడిందో సీమాoధ్రలలో పెల్లుబికిన ఆగ్రహం మాటకలందనిది. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీ లకి వెళ్ళి ఎవరు విద్యార్ధులను రెచ్చగొట్టలేదు, జిల్లా కేంద్రాలలో మీటింగ్లు పెట్టి భాగో జాగో అని పిలుపులు ఇవ్వలేదు, శాంతియుతంగా ఆమరణ దీక్ష అని పైకి చెప్తూ జరగ బోయే తీవ్ర పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ దీక్షా స్థలం వద్ద పెట్రోల్ కాన్ లు ఏర్పాట్లు చేసుకోలేదు, మా గురించి చులకనగా రాస్తే శివసేన లాగా పత్రికల మీద దాడులు చేస్తాం అని చెప్పి మీడియా ని బెదిరించి మద్దతు ఎవరూ అడగలేదు, ఇవేమీ జరగకపోయినా, ప్రకటన వచ్చి పట్టుమని పది గంటలు కాకముందే జనాలందరు రోడ్లపైకి వచ్చారు, 15 గంటల్లో సగం శాసనసభ ఖాళీ అయింది. ఇది చాలు సమైక్య ఉద్యమం తీవ్రత ని తెలపటానికి. మొత్తానికి చిరు లేటు గా అయినా లేటెస్ట్ గా ఈ దిశగా అడుగులు వేయటం నాకు తప్పుగా అనిపించట్లేదు.

ఇకపోతే విమర్శల విషయానికి వస్తే అవి చిరంజీవితో ఎప్పుడూ ఉండేవే. రాజకీయాల లోకి రానంత వరకు భయం కాబట్టి రావట్లేదని, వచ్చాక ఇంకా వెళ్లిపోవటం బెటర్ అని, సామాజిక తెలంగాణా అన్నప్పుడు వోట్లు వెయ్యని వారు కూడా ఇప్పుడు మాత్రం దిష్టి బొమ్మ దగ్ధం చేయటం, సామాజిక తెలంగాణా అన్నప్పుడు తిట్టుకున్న ఆంధ్రా వాళ్ళు ఇప్పుడు హర్షించటం మానేసి మాట మార్చాడని మళ్ళీ తిట్టడం ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే.

ఇప్పుడు చిరు చేయాల్సింది ఒక్కటే. సమైక్యంగా ఉంటూ కూడా సామాజిక తెలంగాణా సాధించొచ్చు అని తెలంగాణా ప్రజలకు సమైక్యాంధ్ర మీద నమ్మకం కలిగించాల్సి ఉంది. దానిలో ఉండే లాభాలు, విడిపోతే వచ్చే కష్టాలు వివరించాలి. తెరాస లాగా ఆరోపణలతో కాకుండా ఫాక్ట్స్ (నిజానిజాల) తో ప్రజల ముందుకు వెళ్లాలి. తెలంగాణా ప్రజలు అభివృద్ధి జరగలేదు కాబట్టి ప్రత్యేక రాష్ట్రం ఐతే అభివృధి జరుగుతుంది అని కోరుకుంటున్నారు, కానీ అంతకన్నా ఎక్కువ అభివృద్ధి సమైక్యంగా ఉంటే జరిగే అవకాశం ఉంది అలా జరిగింది కూడా (ఉదా: హైదరాబాదు) అని చెప్పటమే కాకుండా సభ లో తెలంగాణా వాణి ని వినిపించాలి, తెలంగాణా అభివృద్ధి కోసం పాటు పడాలి.

మరి ఈ విషయం సొంత తెలంగాణా MLA లకు కూడా చెప్పలేకపోయాడు మరి తెలంగాణ ప్రజలకు చెప్తాడో లేదో, చెప్తే వాళ్ళు వింటారో వినరో...

Sunday, December 13, 2009

పచ్చని కాపురం లో చిచ్చు పెట్టిన కెసిఆర్

చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతు, లక్ష కోట్ల బడ్జెట్ తో దేశం లోనే అతి పెద్ద రాష్ట్రం గా ముందుకు వెళ్తున్న రాష్ట్రంలో తన సొంత రాజకీయ భవిష్యత్తు కోసం రాష్ట్రాన్నే అగ్నిగుండం గా మార్చేశాడు కెసిఆర్. పొత్తు పెట్టుకోని కూడా పట్టుమని పది సీట్లు గెలవలేని వీ(రు)డు ఇంక భవిష్యత్తు అంధకారమే కానున్న తరుణo లో ఏదో ఒకటి చేసి పూర్వ వైభవం తేవటం కోసం రాష్ట్రాన్నే పణంగా పెట్టాడు.

దీనికోసం వీడు వేయని ఎత్తు లేదు. యూనివర్సిటీలకు వెళ్ళి మీకు ప్రభుత్వోద్యోగాలు రాక పోవటానికి కారణం ఆంధ్రా వాళ్ళు అని రెచ్చగొట్టాడు. అసలు ఒక రాజకీయ నాయకుడికి పాపం పుణ్యం లేకుండా విద్యార్ధులు చదువుకొనే యూనివర్సిటీలల్లో రాజకీయ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అయినా ఈ రోజుల్లో ప్రభుత్వోద్యోగాలు ఎన్నున్నాయి? ఎంత మందికి వస్తున్నాయి అని ఆలోచించే విచక్షణ కూడా లేదా యూనివర్సిటీ విద్యార్ధులకు? ఒక వేళ తెలంగాణా వస్తే వీళ్లందరికి ఉద్యోగాలు వస్తాయి అని కెసిఆర్ గారెంటీ ఇస్తాడా?
ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగు మాట్లాడే వాళ్లందరి ప్రతీకగా తెలుగు తల్లి విగ్రహాన్ని తయారు చేసుకుంటే దానికి తెలంగాణా ఉద్యమానికి సంబంధం ఏంటి? బుద్ధున్న వాడు ఎవడైనా ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తాడా? పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేయటం ఎంత వరకు సబబు?

పాపం తెలుగు వాళ్ళ రాష్ట్రం ఏర్పడుతుంది కదా అని తమ సొంత రాజధానినే త్యాగం చేశారు సీమ వాసులు. కర్నూల్ రాజధానిగా కొనసాగి ఉంటే కర్నూల్ ఈ యాభై యేళ్లలో ఎంతలా అభివృద్ధి చెంది ఉండేది? హైదరాబాదు మన అందరి రాజధాని అనే కదా అందరూ అక్కడ పెట్టుబడులు పెట్టింది? హైదరాబాదు ఒక్క తెలంగాణా రాజధాని అయ్యుంటే అన్నీ పెట్టుబదులు వచ్చి ఉండేవేనా? 50 సంవత్సరాల క్రితమే విజయవాడ అన్నీ విషయాల్లో హైదరాబాదు కి సరి సమానంగా ఉండేది. అలాంటి విజయవాడ కి ఈ యాభై సంవత్సరాలలో ఎన్ని కంపనీలు వచ్చాయి? ఎంత అభివృధి జరిగింది?

రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మధ్య తరగతి సాఫ్ట్వేర్, ఫార్మా ఏంజనీర్లు, ఇతర ఉద్యోగులు, వ్యాపారులు 20 సంవత్సరాల హోంలోన్ అంటే సగం జీవితం సంపాదన పెట్టి హైదరాబాద్ లో ఇళ్లు కొంటున్నారు. అలా వచ్చిన డబ్బు వల్ల రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో అర ఎకరం పొలం ఉన్న వాళ్ళు కూడా కోటీశ్వరులయ్యి వాళ్ళ పిల్లల్ను ఇంటెర్నేషనల్ స్కూళ్లలో చదివిస్తూ స్కార్పియో లలో తిరుగుతున్నారు. ఇలాంటి ఉదాహరణలు కోస్తాంధ్ర, రాయలసీమ లో ఉన్నాయా? ఇలా జీవితాంతం సంపాదించుకొనే డబ్బుని హైదరాబాద్ కు దోచిపెడుతుంటే, సెట్లర్స్ దోచుకుంటున్నారు అని ప్రచారం చేశాడు కెసిఆర్. ఇంతకన్నా అబద్ధం ఇంకోటి ఉంటుందా? ఆమాటకొస్తే అసలు సెట్లెర్ కి నిర్వచనం ఏంటి? పక్క ప్రాంతం నుంచి వచ్చిన వాడా? పక్క ఊరి నుంచి వచ్చిన వాడా? లేక పక్క జిల్లా నుంచి వచ్చిన వాడా? హైదరాబాద్ లో 400 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు తెలంగాణా వాళ్ళు కూడా సెట్లర్స్ అని వాళ్లు కూడా హైదరాబాద్ ని దోచుకుంటున్నారు అంటే పరిస్థితి ఏంటి?

ఇక పోతే ఆంధ్రా వలస పాలకులు మనల్ని పాలిస్తున్నారు అని చేసిన ప్రచారం ఇంకోటి. తెలంగాణ నుంచి కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, దేశానికి ప్రధాన మంత్రులు అయ్యారు కదా. మరి ఆప్పుడు మిగతా ప్రాంతాల వాళ్ళు అలానే అనుకున్నారా? వాళ్ళకి అది ఆత్మ గౌరవ సమస్య అయిందా? తెలంగాణా లో నీటి ప్రాజెక్టులు లేవు అంటే తెలంగాణా వాళ్ళు ముఖ్యమంత్రులు అయినా కూడా కట్టలేదు కదా...మరి ఇది తెలంగాణా వాళ్ళ తప్పా లేక ఆంధ్రా వాళ్ళ తప్పా? తెలంగాణా కి జరిగిన మేలు ని గురించి ఎందుకు చెప్పరు ఈ పార్టీ వాళ్ళు? ప్రతిష్టాత్మక ఐఐటి, ఇఎస్ బి, ఎన్ ఐ టి లు తెలంగాణా లో మాత్రమే ఉన్నాయి. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, రెడ్డీస్, భెల్, సింగరేణి, మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ, అంతర్జాతీయ విమానాశ్రయం ఇలా ఎన్నో తెలంగాణా లో ఉన్నాయి. వీటి వల్ల ఎంతో మంది తెలంగాణా వారికి మేలు జరుగుతుంది. ఇవన్నీ మర్చిపోయి నాణానికి ఒక వైపు మాత్రమే చూపించి జనాలను మభ్యపెడుతున్నాడు కెసిఆర్. విచిత్రం ఏంటంటే మిగతా అన్నీ పార్టీలు కూడా ఈ అవకాశ వాదానికి మద్దతు ఇవ్వటం.

తెలంగాణా వెనకాపడి ఉంటే దానికి కారణం అక్కడ ఉన్న రాజకీయ నాయకులు, దానికి విరుగుడు ప్రత్యేక రాష్ట్రం ఎంత మాత్రం కాదు. ప్రత్యేక రాష్ట్రం రాగానే తెలంగాణా లో ఉన్న ఇబ్బందులు అన్నీ పోతాయనుకుంటే అంత కన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. అసలు కెసిఆర్ కి ప్రత్యేక రాష్ట్రం వచ్చాక అబివృద్ధి ఎలా చేయాలి అన్న దానికి మీద కొంచెం అవగాహన అన్నా ఉందా?
ఇక పోతే ఈ చిచ్చు లో కెసిఆర్ తర్వాత పెద్ద విలన్ మీడియా. ఒకటే సంఘటన ని పదే పదే రెవైండ్ చేస్తూ మరీ చూపిస్తూ సామాన్య జనానికి పిచ్చి ఎక్కుస్తున్నారు. వీళ్లకి కెసిఆర్, టిఆర్ఎస్ వాళ్ళు ఏడి చెప్పినా సెన్సేషనే, ఆ రోజంతా అదే వేస్తుంటారు అదేంటో మరి. మొత్తానికి ఆమరణ నిరాహార దీక్షకి కొత్త భాష్యం చెప్పి తాను సాధించాలనుకున్నది సాధించాడు ఈ కెసిఆర్. తన రాజకీయ మనుగడ కోసం తెలుగు ప్రజల మధ్య ఇప్పటివరకూ లేని స్పర్ధలు సృష్టించాడు. కెసిఆర్ లాంటి ఒక్క రాజకీయ నాయకుడుంటే ఇంకా రాష్ట్రానికి వేరే సమస్యలక్కర్లేదు. నిన్న టిజీ వెంకటేష్ చెప్పినట్లు కెసిఆర్ ఆమరణ దీక్ష చేసినా, లగడపాటి చేసినా వాళ్ళిద్దరికి ఏమీ కాదు, మధ్యలో అమాయకపు ప్రజలే బలి అవుతారు. ఇంకేముంది తెలుగు ప్రజలు తన్నుకు చావండి, అన్నెం పున్నెం ఎరుగని బస్సులను తగలబెట్టండి, దాడులు చేయండి, తెలుగు జాతినే నాశనం చేయండి.

Wednesday, November 4, 2009

రాజకీయంగా ఎదుగుతున్న ప్రరాపా.

కాంగ్రెస్ తో పొత్తు విఫలం కూడా ప్రజారాజ్యానికి ఒకందుకు మంచిదే అయ్యింది. ముందు ముందు పొత్తులకు వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్త లు వహించాలో చెప్పకనే చెప్పింది ఈ పాఠం. పొత్తు విఫలం అవ్వటాన్ని పక్కన పెడితే రాజకీయంగా ప్రరాపా కూడా కొద్దికొద్దిగా ఎదుగుతున్నట్లు కనిపిస్తుంది. ఒకటి కాంగ్రెస్ లాంటి పార్టీ తో పొత్తు చర్చలు జరపటం ద్వారా తెదేపా లాంటి పార్టీల గొంతులో వెలక్కాయ పడినట్లయింది. ఈ రకంగా ప్రరాపా కూడా రాజకీయంగా ఎత్తులు వేయటానికి ప్రయత్నించటం బాగుంది. ఇక్కడ అన్నిటికన్నా పెద్ద కామెడీ ఏంటంటే ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలి అని తెదేపా డిమాండ్ చేయటం. మరి వాళ్ళు 2009 ఎన్నికల్లో అప్పటి వరకు బండబూతులు తిట్టుకున్న తెరాస తో పొత్తు పెట్టుకొని జనాలకు ఏమి వివరణ ఇచ్చారో వాళ్లకే తెలియాలి. ఇక పొత్తు లేకుండా ఒక్క ఎన్నికల్లో కూడా బరిలోకి దిగని వామ పక్షాల వాళ్ళు కూడా ఈ విషయం మీద తోక ఊపే వాళ్ళే.
ఈ మధ్య ప్రరాపా లో కనిపిస్తున్న ఇంకో మార్పు ఏంటంటే ఎవరన్నా విమర్శిస్తే వాళ్ల చెంప పగిలేలా సమాధానం చెప్పటం. మొదట్లో ఎవరన్నా విమర్శిస్టే వాళ్ళ పాపానికి వాళ్ళేపోతారు అని ఊరుకొనే వాళ్ళు ప్రరాపా వాళ్లు. ప్రత్యర్ధులందరు టికెట్లు అమ్ముకున్నారు అని అని భారీగా విమర్శించినా దాని మీద పెద్దగా స్పందించకపోవటం వల్ల పార్టీ కి భారీ నష్టమే జరిగింది. ఆ విషయం లేట్ గా అయినా లేటెస్ట్ గా తెలుసుకున్నట్లున్నారు. వామ పక్షాలు పొత్తు మీద విమర్శిస్తే "పొత్తుల్లో చరిత్ర సృష్టించిన మీరు మాట్లాడకుండా ఉంటే మంచింది" అన్నీ వంగా గీత గట్టి సమాధానమే చెప్పింది. తెదేపా వాళ్ళు ఒక చర్చ లో మీరు ఎందుకు విధానాలని మార్చుకొని పొత్తు పెట్టుకుంటున్నారు అని అడిగిన దానికి "సంక్షేమ పధకాలకు వ్యతిరేకం అని చెప్పిన చంద్ర బాబు మనిషికి రెండు వేలు ఇచ్చి రాష్ట్రాన్ని దివాళా తీసే పధకాన్ని తెచ్చి మీ మౌళిక మైన విధానాలనే మార్చుకున్నారు". అలాంటి మీరు మమ్మల్ని మా విధానాలు మార్చుకున్నాము అంటూ అనటం హాస్యాస్పదం అని వాసిరెడ్డి పద్మ సమాధానం బాగుంది.
ఏది ఏమైనా ప్రరాపా కి ఇలా దెబ్బ మీద దెబ్బ తగలటం వల్ల పార్టీ లో కొద్ది కొద్దిగా కసి పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. మరి చూద్దాం ఈ కసి అన్నా పార్టీ ని నిలబెడుతుందో లేదో.

Tuesday, October 20, 2009

'చంద్రు'ని విపణి లో మరో క్షిపణి

ABN ఆంధ్రజ్యోతి వార్తా ఛానెల్ ఒకటి కలిసింది 'ఈ-టీవీ', 'ఈ-టీవీ 2', 'టీవీ 5', 'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి', 'సూర్య' ల గుంపుకు . ఈ ఛానెల్ ను ఏకంగా ప్రారంభం నుంచే బాబు కి అంకితం ఇచ్చినట్లున్నారు. ఇన్ని రకాల మీడియా వాళ్ళు అండగా ఉంటే ఏమైనా చేయొచ్చు అనో, లేక ఇంకో ఆయిదేళ్ల తర్వాత అధికారం జలగ లాగా పట్టుకుంటుందనో లేక ఇలాంటి పక్షపాత ధోరణి తో కూడుకొని ఉన్న ఛానెల్స్ చూస్తున్న జనాల అమాయకత్వం చూసో కానీ ఎక్కడ చూసినా బాబే వినూత్నంగా తెగ నవ్వుతూ ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు ఈ ఛానెల్ వెబ్సైట్ లో. మొత్తానికి రాజశేఖరరెడ్డి పోయినప్పటి నుంచి కొత్త ఉత్సాహం వచ్చినట్లుంది బాబు అండ్ కో కి. ఇక సీట్లు ఆశిస్తున్న వాళ్లంతా ఇప్పటినుంచే గాంబ్లింగ్ మొదలు పెడుతున్నారు. ఏదో ఒక రకంగా భవిష్యత్తు లో లాభ పడటానికి ఇప్పటినుంచే బాబు కి సహకరిస్తున్నారు. మరి ఈ ఛానెల్ ప్రారంభం వెనుక ఎలాంటి మతలబులున్నాయో. సాక్షి కి ఈనాడు అండ్ కో కి తేడా ఏంటంటే ఒకడు దొంగ రూపం లో ఉన్న దొంగ, ఇంకొకడు మంచి వాడి రూపంలో ఉన్న దొంగ. దీనిలో రెండో వాడి వల్లే నష్టం ఎక్కువ. కొత్త ఛానెల్ కానీ వార్తా పత్రిక గాని వస్తుంటే ఏ పార్టీ వారిదో ఆ ఛానెల్ అని అడగాల్సి వస్తుంది చివరికి.
సరే ఇవన్నీ ఎప్పుడూ ఉండేవేలే కానీ, ఇన్ని తెలుగు న్యూస్ ఛానెల్స్ వల్ల తెలుగు వచ్చిన వారికి కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడుతున్నాయి కాబట్టి వీళ్లకి నా అభినందనలు.

Tuesday, September 22, 2009

మగధీర కొత్త సన్ని వేశాల తర్వాత ...

కొత్త సీన్స్ ఏంటి?

- శ్రీహరి, చరణ్ కలిసి ఉదయ్గఢ్ వెళ్లి రాకుమారిని తప్పించే ప్లాన్స్ వేయటం, మధ్యలో విలంతో ఒక చిన్న ఫైఠ్, ఘోరా తో ఒక చిన్న సన్నివేశం.

సినిమా కి వాటి అవసరం ఏంటి?

-ఆ సీన్స్ లేకమునుపు చరణ్ ఉదయగఢ్ వెళ్లాక చివరి సీన్ లో అకస్మాత్తుగా స్రీహరి కనిపించటం కొద్దిగ కంటిన్యుటీ లేనట్లు గా అనిపించింది. ఆ కొత్త సీన్స్ కలిపాక కొంచెం కంటిన్యుటీ పెరిగింది.

కొత్త సన్నివేశాలు ఎలా ఉన్నాయి?

- ఎక్కువ శాతం హెలికాప్టర్ ని జీపు గుద్దే సన్నివేశం తో పోలి ఉన్నాయి. అంటే అవి చూడగానె కొద్దిగా నవ్వొచ్చే విధంగా ఉన్నాయి. ఇంకొ రకంగా చెప్పాలంటే అరవ సినిమా లో ఫైట్లలాగా ఉన్నాయి కొద్దిగా.

కొత్త సన్నివేశాల కోసం మగధీర మళ్లీ చూడాలా?

-అవసరం లేదు

Thursday, August 20, 2009

తెలుగుదేశం - ఈనాడు - ఆంధ్రజ్యోతి

ఈ పోస్ట్ లో ఎ2జెడ్ అన్నట్లు తొమ్మిది సంవత్సరాలు అధికారం లో ఉండి ఈ పనులు మేము చేశాం కాబాట్టి మమ్మల్ని గెలిపించండి అని అనాల్సింది పోయి పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేక వోటు మీద ఆధారపడి చిన్న పార్టీలకు వోటు వేయటం వృధా అంటూ చివరికి ఒక సీటు మాత్రమే గెలుచుకున్న లోక్సత్తా మీద కూడా ఏడవటం చాలా ఛండాలంగా ఉంది.

ఒక పక్క ప్రభుత్వం ఆపరేషన్ "ఆకర్ష్" ప్రవేశ పెట్టింది అంటూ తన రెండు పత్రికలలో గగ్గోలు పెట్టిస్తూ ఇటు పక్క "ప్రజారాజ్యం" లో ఉన్న పాత తెదేపా నేతలందరితోటి ఫోన్ లలో సంప్రదించి పార్టీలోకి రావాలని ఆహ్వానించటం, నేతలు ఎవరు తిరిగి వచ్చినా పూర్వ గౌరవం ఇస్తాం అని పబ్లిక్ గా ప్రకటనలు ఇవ్వటం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.

అసెంబ్లీ లో ఎప్పుడు చూసినా నువ్వంత తిన్నావు, నువ్వు ఇంత తిన్నావు, నువ్వో పెద్ద ఫాక్షనిస్ట్ వి అంటూ వ్యక్తిగత విమర్శలే కాని, సరిగ్గా సమస్యల గురించి గత ఇదేళ్లలో చేసింది చాలా తక్కువ. కొత్తగా అసెంబ్లీ లో అడుగు పెట్టిన చిరంజీవి, జెపి లను చూసి కూడా వీళ్లకు బుద్ధి రావట్లేదు. మాట్లాడితే వాకౌట్ లేక పోతే నిరసనలు తప్పితే సమస్యలు పట్టవు. డే 1 నుంచి కాంగ్రెస్ ఏది చేసినా వీళ్లకు తప్పే. మాట్లాడితే కాంగ్రెస్ ది సాంకేతిక గెలుపు మాత్రమే, మేం ఓడిపోయి గెలిచాం, వాళ్లు గెలిచి ఓడిపోయారు అనటం బాబు మూర్ఖత్వానికి నిదర్శనం. 64 శాతం మంది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వేశారు అంటాడే కాని 70 శాతం మంది తెలుగు దేశానికి వ్యతిరేకంగా ఉన్న సంగతి మాత్రం ఆయనకు అనవసరం.

ఇక వీళ్లేం చేసినా వంత పాడటానికి ఒక రెండు వెధవ పత్రికలున్నాయి. నేను అనుకోవటం రామోజీ రావు, బాబు, రాధా కృష్ణ ల మధ్య రోజు కాంఫరెన్స్ జరుగుతుందేమో. ముగ్గురు కలిసి ఒక సమయం లో ఒకే ఒక వార్త ని బలంగా ప్రజల మీద రుద్దతానికి ప్రయత్నిస్తారు. నెల రోజుల క్రితం ఆపరేషన్ "ఆకర్ష్" అని ప్రభుత్వం మీద పడ్డాయి. కొన్ని రోజుల తర్వాత లోక్సత్తా పార్టీ మీద ఏడ్చాయి. ఇప్పుడు తాజాగా ప్రజా రాజ్యం మీద పడ్డాయి. ప్రజా రాజ్యం లో నాయకులు ఆనందంగానే ఉన్నా వాళ్లు పార్టీ మారాలనుకుంటున్నారు, వీళ్లు మారాలనుకుంటున్నారు అంటూ వార్తలు రాసి వాళ్లు నిజం గా తెదేపా లో చేరేటట్లు చేయటం ఈ ఆపరేషన్ లక్ష్యం. వాస్తవానికి ప్రజా రాజ్యం వల్ల తెలుగు దేశం కు ఎంత నష్టం జరిగిందో కాంగ్రెస్ కూడా అంతే నష్టం జరిగింది. కాని ఈ ముగ్గురు పని గట్టుకొని కాంగ్రెస్ కి ప్రజా రాజ్యం వల్ల లాభం అంటూ ఒకే సారి ఊదరగొడుతూ ప్రభుత్వ వ్యతిరేక వోటు పొందాలని చూస్తున్నారు. చిరంజీవి ని కాంగ్రెస్ కు ఎంత దగ్గరగా చూపిస్తే వీళ్లకు అంత లాభం అని వీళ్ల ఉద్దేశం. ఇవ్వాళ ఈనాడు లో వచ్చిన వార్తే దీనికి నిదర్శనం.

ఒక ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉండి కరువు, ధరల పెరుగుదల, కేంద్రం లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, బెల్ట్ షాపులు, విపరీతంగా ఫీజుల పెంపకం, అధ్వాన్నమైన రోడ్లు, మంచి నీటి సమస్య, ప్రభుత్వ స్థలాల అమ్మకం ఇలాంటి సమస్యల పై అసెంబ్లీ లో పోరాడకుండా అసెంబ్లీ బయట ఇలా మీడియా తో కుమ్మక్కై దొంగ రాజకీయాలు చేయటం దారుణ మైన విషయం.

రెండు ప్రముఖ దినపత్రికలు అయ్యుండి ప్రజలకు నిజా నిజాలు అందించాల్సింది పోయి ఒక రాజకీయ పార్టీ కి అండగా చేరి ప్రజలను మభ్య పెట్టడం దారుణాతి దారుణం.

Wednesday, July 15, 2009

దుర్గాబాయి దేశ్ ముఖ్

ఇవ్వాళ ఏదో ఇంగ్లీష్ పేపర్ తిరగేస్తుంటే ఇవ్వాళ దుర్గాబాయి దేశ్ ముఖ్ పుట్టిన రోజు అని ఆమె మీద మంచి వ్యాసం రాసి ఉంది. చిన్నప్పుడు ఆమె పేరు మీద ఉపవాచకం చదివినట్లు గుర్తు ఉంది కాని, అంతకు మించి పెద్దగా గుర్తు లేదు. మన రాష్ట్రానికి చెందిన అందులోను ఒక మహిళ జాతీయ స్థాయిలో అన్ని విజయాలు సాధించి అంతటి పేరు ప్రతిష్టలు పొందటం నిజంగానే అరుదు. ఇక మన ఘనత వహించిన ముఖ్యమంత్రి గారికి ఏ పధకం పెట్టినా ఇందిర, రాజీవ్ ల పేర్లు తప్ప ఇలాంటి గొప్ప వాళ్ల అందులో మన తెలుగు వాళ్ల పేర్లు అసలే గుర్తు రావు. సరే ఆయన సంగతి వదిలేస్తే తెలుగు మహిళ అని, మహిళా రాజ్యం అని, పేర్లు పెట్టుకొని బూతులు తిట్టుకోవటం తప్పితే ప్రతిపక్షాల మహిళా విభాగాలు ఎందుకు పనికి రావు. ఇక మన పత్రికలైన ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి లలో కనిసం ఆవిడ పుట్టిన రోజు అని ఒక మూల కూడా రాసినట్లు లేవు. ఒక్క అంధ్రప్రభ లో మాత్రం చక్కగా దీని మీద ఒక చిన్న వ్యాసం ప్రచురించారు.

Friday, June 19, 2009

నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా తీరుగా మైక్రోసాఫ్ట్, గూగుల్ పోరు

చిన్నప్పుడు కధల్లో చదువుకున్న ఈ సన్నివేశం ఇప్పుడు ఈ రెండు సాఫ్ట్వేర్ వీరుల మధ్య జరుగుతున్నట్లుంది. ఎవరైనా నెట్ లో ఏదన్నావెతకాలంటే చటుక్కున గుర్తొచ్చేది గూగుల్. సెర్చ్ కి అంత మార్కెట్ ఉంటుంది అని కనిపెట్టి దానికి కావాల్సిన అల్గారిథంస్ రాసి ఎంతో మంది కి డ్రీం కంపనీ అయింది గూగుల్. ఇక పోతే మెయిన్ ఫ్రేం కంప్యుటర్ లు రాజ్యమేలుతున్న రోజుల్లో వ్యక్తి గత పిసి లకు భవిష్యత్తు లో ఉండబోయే మార్కెట్ ను అంచనా వేసి దానికి తగ్గ ఆపరేటింగ్ సిస్టం తయారు చేసి ప్రపంచం లోనే అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపనీ గా తయారయ్యింది మైక్రోసాఫ్ట్.

ఇక పొతే నిన్న గాక మొన్న వచ్చిన గూగుల్ ఒక్క సెర్చ్ అనే ఫీచర్ తోనే ఆన్ లైన్ ప్రకటనల తో కోట్లు గడిస్తుండటం తో ఎక్కడో మైక్రోసాఫ్ట్ కి కన్ను కుట్టింది. దానికి తోడు గూగుల్ సెర్చ్ నుంచి తన పరిధిని విస్తరించుకుంటూ చిన్నగా మైక్రోసాఫ్ట్ కి బాగా బలమున్న డెస్క్ టాప్ ఏరియా లో అదుగు పెట్టి దానికి బ్రెడ్ అండ్ బటర్ అయిన ఆఫీస్ లాంటి మీదే గురి పెట్టి చిన్నగా అప్పటిదాకా ఎదురే లేదనుకున్న మైక్రోసాఫ్ట్ కే పోటీదారు గా మారింది. దీంతో మైక్రోసాఫ్ట్ కు పుండు మీద కారం చల్లినట్లు అయింది. "మన పరిధిని మనము పెంచుకొంటూ పోకపోతే అందరూ పోటిదార్లు కలిసి తలా ఒక పక్కనుంచి వచ్చి మనల్ని ప్రెస్ చేసి మనకు ఒక పరిధి అంటూ లేకుండా చేస్తారు" అన్న సిద్ధాంతాన్ని చరిత్రను చూసి అవగతం చేసుకున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ కుంభ స్థలాన్నే కొట్టడానికి నిర్ణయించుకుంది. నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అంటూ గూగుల్ కి పోటీ గా జూన్ నెలలో "బింగ్" అనే కొత్తసాఫ్ట్ వేర్ ని విడుదల చేసింది. సెర్చ్ తో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి "డెసిషన్ ఇంజన్" అనే కొత్త మార్కెటింగ్ అంశం తో ముందుకొచ్చింది. దాని పనితనం కూడా మైక్రోసాఫ్ట్ నుంచి ఆశించిన దాని కన్నా మిన్నగా ఉండటంతో నిపుణులు కూడా ఇప్పటికిప్పుడు గూగుల్ స్థానానికి వచ్చ్హే నష్టం ఎమీ లేకపోయినా ఇక మీద గూగుల్ పని నల్లేరు మీద నడక కాదు అని భావిస్తున్నారు. గూగుల్ కూడా ఈ హఠాత్పరిణామాన్ని ఎదుర్కోవటానికి దాని స్థాపించిన వారిలో ఒకరైన సర్గీ బ్రిన్ ఆధ్వర్యంలో ఒక టీం ని ఏర్పాటు చేసింది అని వినికిడి. అయితే మిగతా వీక్షకులు మాత్రం ముందు ముందు ఈ కొత్త పరిణామం ఈ రెండు యోధుల మధ్య పోటీని భవిష్యత్తు లో ఇంకా తీవ్రంగా, ఆసక్తికరంగా మారుస్తుంది అంటున్నారు.
చూద్దాం ఈ పోటీలో ఎవరు గెలుస్తారో.

Monday, May 18, 2009

ప్రజా రాజ్యం తుస్సు మన్నదా?

ఒక రెండు మూడు రోజుల్నుంచి ఈనాడు లాంటి విష పత్రికల వాళ్లు, మన బ్లాగు సోదరులు అందరు ప్రజా రాజ్యం తుస్సు మంది అనో ఘోరం గా ఓడింది అని అంటున్నారు. అలా అనటం ఎంత వరకు సమంజసం? 
1) ప్రజా రాజ్యానికి వచిన సీట్లు 18, వోట్ల శాతం సుమారు 16. 130 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ  కి  36% వోట్లు వస్తే, 30 ఏళ్ల నుంచి ఉన్న పార్టీ కీ 26% వస్తే, 8 నెలలున్న పార్టీ కి 16% శాతం వోట్లు వచ్చాయి. ఇది విజయం కాదా?. 
2) ఒక వేళ శాతం ప్రకారం సీట్లు వచ్చి ఉంటే కాంగ్రెస్ కి సుమారు 100, తెదేపా కి 75, ప్రరాపా కి 50 వరకు వచ్చి ఉండేవి. ఎనిమిది నెలలు వయసు ఉన్న పార్టీ కి ఇంత స్పందన రావటం తుస్సుమన్నట్లా?    
3) వై యెస్ ఇదేళ్లలో, బాబు 9 ఏళ్లలో వాళ్ల వాళ్ల పాలన ఎంటొ ప్రజలకు చూపించారు. వాళ్లకి వోట్లు వేసిన వాళ్లు ఆ పనులని చూసి వోట్ వేసుంటారు ఆయా పార్టీలకు. కాని ఇంత వరకు రాజకీయాల్లోనే లేని ఒక వ్యక్తి కి 16 శాతం వోట్లు రావటం, ముక్కోణపు పోటి లో ఒక్కరితోను పొత్తు లేకుండా తర తరాల నుంది ఉన్న పార్టీ లను ఖంగు తినిపించి 18 సీట్లు గెలుచుకోవటం వోటమి అవుతుందా?   
4) ఈనాడు, సాక్షి లాంటి విలువల్లేని వార్తా పత్రికలు చిరు పార్టీ పెట్టక ముందు నుంచి చేసిన నెగిటివ్ ప్రచారాన్ని తట్టుకొని, ఎన్నికలు ఇంకో పది రోజులు ఉందనగా పరకాల లాంటి వాళ్ల తో ఆడించిన డ్రామాలను  తట్టుకొని అన్ని సీట్లు సాధించటం ఏ రకంగా వోటమి? ఇప్పుడు ఇలా అనే పత్రికలలో ఒక్కళ్లు కూడా ఎన్నికల ముందు చేసిన విశ్లేషణలలో ప్రజా రాజ్యానికి 40 కన్నా సీట్లు వస్తాయని రాయలేదు. ఇప్పుడు మాత్రం తుస్సు, బర్రు అంటారు.
5) ఒక వేళ వై యెస్ గాని, చంద్ర బాబు కాని వాళ్ల పార్టీ లను వదిలి కొత్త పార్టీ ని పెట్టి వాళ్ల వాళ్ల వ్యక్తి గత బలాల మీద 16% వోట్లు సాధించే దమ్ము ఉందా? అసలు వాళ్లకే కాదు మన రాష్ట్రం లో ఎవరికైనా ఉందా? వాళ్లకు వచ్చే వోట్ల లో సిం హ  భాగం వోట్లు ఆయా పార్టీలను తరతరాలుగా వెన్నంటి ఉన్న ప్రజలవి. ఇలా సొంత బలమే పార్టీ బలంగా వచ్చిన వ్యక్తి 18 సీట్లు సాధించాడు.
6) ఒకప్పుడు రామారావు పార్టీ పెట్టటం తోనే అధికారం లోకి వచ్చాడు. కాని అప్పుడున్నట్లు రాజకీయ శూన్యత, ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు లేవు. అవి లేక పోగా విలువల్లేని మీడియా, దబ్బు ప్రభావం ఇలాంటివి దాపురించాయి. ఇవన్ని మన పత్రికలకు చిరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు  రాశారు కూడా. వీటిని తట్టుకొని పార్టీ 18 స్థానాల్లో మొదటి స్థానం లో, 34 స్థానాల్లో రెండో స్థానాల్లో నిలిచింది. ఇది ముమ్మాటికీ గొప్పే. అయితే 230 స్థానాల్లో ముడో స్థానం లో ఉంది అని రాశారు మన "largest circulated daily of AP (that circulates largest number lies daily) " వారు.  
 పార్టీ పెట్టగానే 200 సీట్లు వస్తాయనుకోవటం అతిశయోక్తే అవుతుంది. ఈ మంచి ప్రారంభాన్ని పార్టీ మరింత బలోపేతం చేయటానికి వాడుకుంటారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. 

Wednesday, April 15, 2009

నేనూ వోట్ వేస్తున్నానోచ్!

చిన్నప్పుడు ఎప్పుడో ఎన్నికలు జరిగేటప్పుడు మా అమ్మ తో పోలింగ్ బూత్ లోకి వెళ్లి నేను కూడా చుక్క పెట్టించుకొని బడి లో అందరి దగ్గర ఫోస్ కొట్టేవాడిని వోట్ వేశానని చెప్పి. కొంచెం పెద్ద అయినప్పటినుంచి ఎప్పుడూ ఇంకా ఆ జోలికి పోలేదు. ఇంక చదువు అయ్యాక డిల్లీ లో ఒక ఆరేళ్లు ఉన్నా ఎప్పుడూ వోట్ కి దరఖాస్తు చేయలేదు. ఇక ఈ సారి ఎన్నికలు ఈ మధ్య వచ్చిన కొత్త పార్టీ ల వల్ల చాలా రంజు గా మారాయి. ఎందుకంటే ప్రధాన పార్టీల రేఖలు వాళ్ల బలం మీదే కాకుందా వాళ్ల నుంచి కొత్త పార్టీలకు చీలే వోట్ల మీద కూడా ఆధారపడి ఉన్నాయి. సరే ఏది ఏమైనా ఈమధ్యే నేను హైదరాబాదు రావటం, రాగానే వోట్ కి అప్లయి చేయటం, చేసిన ఇరవై రోజుల్లోనే అది రావటం అన్ని చక చకా జరిగిపోయాయి. మొత్తానికి మొదటి సారి వోట్ వేయబోతున్నాను కాబట్టి  చాలా అనందం గా ఉంది.  
నాలాగే మొదటి సారి వొటు హక్కు ఉపయోగించుకుంటున్న అందరికి శుభాకాంక్షలు, అభినందనలు, విజయం ప్రాప్తిరస్థు.

ఒక ప్రరాపా ప్రెజెంటేషన్

నెట్ లో అవినీతి మీద  రూపొందించిన ప్రజారాజ్యం ప్రెజెంటేషన్ ఒకటి దొరికింది. వీలుంటే చూడండి.  http://www.slideshare.net/PrajaRajyam/anti-corruption

Tuesday, April 14, 2009

లోక్ సత్తా లో నన్ను ఆలోచింప జేసిన విషయాలు

అందరిలాగానే నేను కూడా జెపి గారి ఇంటర్వ్యూ లు, ప్రసంగాలు చూసి ఆయన అభిమానిని అయ్యాను. ప్రజారాజ్యం ఆవిర్భవించినప్పుడు చిరంజీవి లోక్సత్తా తో పొట్టు పెట్టుకుంటే బాగుండు అని అనుకున్న వాళ్ళలో నేను ఒకడిని. ఇక కొన్ని కారణాల వల్ల ఆ పొత్తు జరగలేదు.
అయితే ఈమధ్య ఆయన మీద కొద్దిగా అభిమానానం తగ్గటానికి కారణం పార్టీలకు కర పత్రాలు గా మారిన వార్తా పత్రికల్లో వచ్చిన నిరాధారమైన వార్తలను పట్టుకొని చిరంజీవి ని విమర్శించటం. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ మధ్య జరిగిన రెండు సంఘటనలు ఆయన గురించి ఆలోచింప జేసేలా చేసాయి.
ఒకటి: ఆయన ఎన్నికల సంఘానికి చెప్పిన ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ సుమారు ఆరు కోట్లు. ఆ ఆస్తుల మార్కెట్ విలువ ఇంకో రెండు మూడు రెట్లు ఉండొచ్చేమో . మరి ఒక ఐఎఎస్ ఆఫీసర్ తన పదవికాలంలో అంత సంపాదించగలడా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం. అఫ్కోర్స్, ఆయనకు అది సంక్రమించిన ఆస్తి కూడా అయ్యుండొచ్చు. కాకపోతే దాని గురించి పూర్తీ వివరాలు నాకు తెలీవు కాబట్టి ఈ విషయం నన్ను ఆలోచింప జేసింది.
రెండోది: మూడు కుటుంబాలకు వోట్ వేస్తారో లేక మాకు వోట్ వేస్తారో అని పదే పదే చెప్పే ఆయన, ఆయన భార్య తో కుకట్ పల్లి లో ప్రచారం చేయించు కోవటం.

Monday, April 13, 2009

ప్రరాపా మానిఫెస్టో లో నాకు నచ్చిన అంశం

"గత పదిహేనేళ్లు గా రాష్ట్రం లో జరిగిన అవినీతి పై హై కోర్ట్ జడ్జ్ తో విచారణ". రాష్ట్రం లో గత ఐదు సంవత్సరాలలో విపరీత మైన అవినీతి జరిగింది అని అందరికి తెలుసు. ఇక మన గౌరవమైన ప్రతిపక్ష నాయకుడు చంద్ర బాబు గారు దీని మీద రాష్ట్ర పతి కి కూడా వినతి పత్రం సమర్పించారు. కాని ఆయన పొరపాటున అధికారం లోకి వస్తే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటారు. ఎందుకంటే ఆయనదీ అదే జాతి కదా. ఆయన హయాం లో కూడా ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అఫ్కోర్స్, అప్పుడు ఆరోపణలు చేసిన రెడ్డి గారు కూడా అధికారం లోకి వచ్చాక వాటి మీద చర్య తీసుకోలేదు. ఒకప్పటి మిత్రులు కాబట్టి వాళ్లిద్దరి మధ్య అండర్ స్టాండింగ్ మొదటి నుంచి ఉంది అనుకుంటా. 


పిఎస్: బ్లాగు చదివిన వారి కోరిక మేరకు మానిఫెస్టో లింక్ ఇస్తున్నాను.  http://prajarajyam.org/2009/04/09/prajarajyam-manifesto/ 

Friday, April 10, 2009

పరకాల ప్రభాకర్

పరకాల ప్రభాకర్ ప్రజా రాజ్యం లో చేరినప్పుడు ఎన్ని పేపర్లలో హెడ్ లైన్స్ లో రాశాయో తెలీదు కాని ఆయన రాజినామా మాత్రం ప్రజ స్వామ్యం లో అప్రజాస్వామ్యక శక్తులైన ఈనాడు, సాక్షిలు బాగా ఉపయోగించుకున్నాయి. వాళ్ల వాళ్ల పార్టీ లను గద్దె ఎక్కించటానికి ఎంతకైనా తెగిస్తాయి ఈ పత్రికలు.
ఇక అసలు విషయానికి వస్తే, పది నెలల క్రితం అంధ్రా లో ఎవరికి ఈయన పేరు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. పరకాల ప్రభాకర్ మొదట ప్రజా రాజ్యం లో చేరినప్పుడు ఆయన ఎవరా అని అడిగితే కొంత మందేమో ఆయన ఈ టివి వ్యాఖ్యాత అని కొంత మంది, మేధావి అని కొంత మంది, ప్రజా రాజ్యం లో రామోజీ రావు మనిషి అని ఇలా రక రకాలుగా వినిపించాయి నాకు. ఇక కొన్ని రోజులకు ఎదో లోక్ సభ స్థానాని కి ఆయన పేరు ప్రజా రాజ్యం పరిశీలుస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈయన పని బాగుందే ఏకంగా లోక్ సభ సీటు నే కొట్టేస్తున్నాడు అనుకున్నాను. తీరా మరి చూస్తే ఆయనకు సీటు రాలేదు. ఇంకేముంది ఏకంగా పార్టీ ని పార్టీ కార్యాలయం లోనే "విషవృక్షం" అనేసాడు. అదే ఆయనకు సీటు వస్తే ఈ "కల్పవృక్షం" అనో లేక "బోధివృక్షం" అనో అనేవాడెమో. విషవృక్షం అని తెలిసిన వాడు వెంటనే రాజీనామా చేయాలి గాని తనకు టికెట్ రానంత వరకు ఎందుకు ఆగాడో ఆయనకే తెలియాలి? మరి ప్రజా విజయభేరి లో చిరు ని పొగిడిన ఆయన ఈ పది రోజుల్లోనే అంత జ్ఞానోదయం ఎలా అయ్యిందో. ఇవన్నీ చుస్తుంటే ఆయన్ను వెరే పార్టీ ల వాళ్లు కావాలనే ప్రజారాజ్యం లోకి పంపించినట్లు అనుమానం కలుగుతుంది. మొత్తానికి ఎవరో అన్నట్లు ఆయన్ను పార్టీ లోకి పంపిన వారి కార్యం ఆయన బాగానే నెరవేర్చినట్లు కనబడుతుంది.

Wednesday, March 18, 2009

'మెగాస్టార్' ఈ ఇబ్బందులను అధిగమించగలడా?

దాదాపు గా ఒక ఇరవై ఏళ్ళు గా సినిమా రంగం లో రారాజు చిరంజీవి. అట్టడుగు స్థాయి నుంచి అత్యంత ఎత్తుకి ఎదిగాడు తన పట్టుదల, కృషి తో. కోట్లల్లో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ అభిమానమే ఆస్తి గా రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. పార్టీ ఏర్పడిన మొదట్లో అంతా సజావుగానే జరిగినా గత కొద్ది కాలంగా ఎక్కువగా 'చిరు' కి రాజకీయం ఎంత కుట్ర కుతంత్రాలతో కూడిందో అర్థం అవుతూ ఉండి ఉంటుంది. సినిమాల్లో అరంగేట్రం చేసినప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తేలేదు కాని, ఇప్పుడు మాత్రం చాలా ఎదురు దెబ్బలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇందులో మొదటిది, అతి ముఖ్యమైన ఇబ్బంది వార్తా పతికలు, మీడియా మద్దతు లేకపోవటం. వాళ్ల మద్దతు లేక పోగా ఏదో ఒక రకంగా చిరు పేరుని మాత్రం వాళ్ల స్వార్ధాలకోసం వాడుకుంటున్నారు. వాట్లో మొదటగా చెప్పాల్సింది 'ఈనాడు' గురించి. ఎప్పుడైతే సాక్షి తక్కువ డబ్బులతో ఎక్కువ ఫీచర్స్ ఇచ్చి ఈనాడు సర్కులేషన్ తగ్గించిందో అప్పుడు ఈనాడు కి అప్పుడప్పుడే రాజాకియాల్లోకి దూసుకు వస్తున్న చిరంజీవి ఒక బ్రహ్మాస్త్రంలా కనిపించాడు. అదే తడుముగా తన చిరకాల మిత్రుడైన రాముడి పార్టీ ని పక్కన పెట్టి, ఆంజనేయుడి పార్టీ కి ఒక రేంజ్ లో మద్దతు పలికాడు. అది ఎంత వరకు వెళ్లిందంటే చిరు వేసుకున్న చొక్కా రంగు నుంచి, పెట్టుకున్న వాచ్ నుంచి, మొహం మీద ఎంత శాతం చిరునవ్వు ఉందో, ఎన్ని గంటల ఎన్ని సెకన్ల ఎన్ని మిల్లీ సెకన్లకి ఉపన్యాసం ఇచ్చాడో అన్నిటినీ వర్ణిస్తూ కథనాలు రాయసాగాడు. అలా అభిమానులను ఈనాడు చదివించేలా ఆకట్టుకొని తన కష్ట సమయాల్లో గట్టెక్కాడు. ఎప్పుడైతే సాక్షి సర్కులేషన్ తగ్గటం మొదలు పెట్టిందో మళ్లీ చిరు ని పక్కన పెట్టి ఎప్పటిలాగానే తెదేపా ని అందలం ఎక్కించటం మొదలు పెట్టాడు. ఇక ఇప్పుడు చిరు గురించి ఈనాడు లో ఎక్కువగా రాసే అంశాలు "ప్రరాపా కమిటీ మీటింగ్ లో కార్యకర్తలు కొట్టుకున్నారు" అనో లేక ప్రరాపా అజెండా గురించి ఎవరో చేసిన విమర్శనో రాస్తాడు. మంచి విషయాలని ఏ మూలో ఎవరూ చదవని పేజీ లో రాస్తాడు. ఇక సాక్షి విషయానికి వస్తే మొదటి నుంచి ఒకే తీరు: కాంగ్రెస్స్ని తప్ప మిగతా పార్టీ లను విమర్శించటమే. మొదట చిరు ని విమర్శిస్తే అభిమానులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవటానికి "పొలిటికల్ గాసిప్' 'కాలం' లో అన్నీ చిరు గురించి నెగెటివ్ గా రాసేవాడు. చిన్నగా అభిమానులు ఆ విమర్శలకు సెట్ అయ్యాక అవే ముఖ్య వార్తల్లో రాయటం మొదలు పెట్టాడు. ఇక అంధ్రజ్యోతి, వార్త, సూర్య కి కూడా వాటి వాటి పార్టీలు ఉండనే ఉన్నాయి. ఇలా చిరు కి యే ఒక్క పత్రిక మద్దతు కూడా లేదు.
ఇక టీవీల విషయానికి వస్తే వీళ్లకి కావల్సింది సెన్సేషనల్ న్యూస్ మాత్రమే, నిజానిజాలు ఎంత మాత్రం కావు. రోజా, జీవిత, రాజశేఖర్ వీళ్ల పాలిట దేవుళ్లు. వాళ్లు యే చౌక బారు విమర్శ చేసినా "ఫ్లాష్...ఫ్లాష్..." అంటూ రోలర్స్ వేస్తారు. ఆ రోజంతా వాళ్లందరి తోటి పదే పదే ఇంటర్వ్యూ లు పెట్టి, వింత వింత చర్చలు పెట్టి పండగ చేసుకుంటారు. మనకు తెలియకుండానే చిరంజీవి గురించి నెగెటివ్ అభిప్రాయం వచ్చేలా చేస్తారు. టీవీ 9/5, ఎన్ టీవీ ఈ కోవ లోకి వస్తాయి.
ఇక పోతే మిగతా పార్టీ ల రాజకీయ నాయకులు: వీళ్లకి కావల్సింది ఎదో ఒక విధంగా ఆయా పార్టీల అధినేత కళ్లల్లో పడటం, పార్టీలో తమ స్థాయిని పెంచుకోవటం. ఇక వీళ్లకి కూడా ఆయుధం చిరంజీవే. చిరంజీవి ని "శని నాయకుడు" అనో లేక పోతే బ్లడ్ బాంక్ లో రక్తం అమ్ముకున్నాడనో అంటేనే వీళ్ల పేర్లు పత్రికల్లో వస్తాయి, ముఖాలు టీవీల్లో కనిపిస్తాయి. రోజా, మారెప్ప లాంటి వాళ్లు ఈ కోవ కి చెందిన వాళ్లు. పదే పదే ఒకళ్లనే లక్ష్యం గా చేసుకొని విమర్శించి అవతలి వాళ్లని రెచ్చగొట్టటం వీళ్ల ఏకైక లక్ష్యం.
ఇక "ప్రరాపా" లో టికెట్ ఆశించి చేరేవాళ్లది ఇంకో కోవ. టికెట్ రాదు అని కన్ ఫర్మ్ అయ్యాక "ప్రజా రాజ్యం లో సామాజిక న్యాయం జరగట్లేదు" అనో లేక "టికెట్ కి దబ్బులు అడుగుతున్నాడు" అనో ఒక విలేఖరుల సమావేశం పెడతారు. అన్ని టీవీ చానెల్స్ దాన్ని లైవ్ ప్రసారం చేస్తాయి. వీళ్లందరూ కాక కోవర్టులు ఇంకా ఉండనే ఉన్నారు.
ఇక అభిమానులు కూడా చిరంజీవిని వదలలేదు. రాజశేఖర్ మీద దాడి ఇందుకు సరైన ఉదాహరణ. చిరంజీవి ద్రుష్టి లో పడాలని వాళ్లు అలా చేశారు. దాని వల్ల చిరంజీవికి, అభిమానులకీ ఎంత చెడ్డ పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే.
చివరికి ఎన్నికల సంఘానిది కూడా అదే తీరు. రాష్ట్రం లో ఉన్న వోటర్లలో పది శాతం మంది సభ్యత్వం ఉన్న పార్టీ కి ఒక ఉమ్మడి గుర్తు కేటాయించాలంటే వాళ్లకి ఇబ్బందంట. అదే 294 అభ్యర్ధులకు 294 గుర్తులు కేటాయించటం మాత్రం వాళ్లకి తేలికంట.
ఇలా వ్యవస్థ లో ఉన్న ప్రతి ఒక్కరు ఇలా 'చిరు' పేరు ను తమ తమ స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారు. చిరు కి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇంతకు ముందు కూడా చాలా సినిమాల్లో డైలాగ్స్ లో మెగాస్టార్ పేరు పెడితే ఫాన్స్ అన్నా చూస్తారనే ఉద్దేశం తో 'చిరు' మీద ఒకట్రెండు డైలాగ్స్ పెట్టారు. అయితే వీటివల్ల చిరు కి వచ్చిన నష్టం ఏమి లేదు. కానీ ఇప్పుడు పత్రికలు మొదలు కొని టీవీ చానెల్స్, రాజకీయ నాయకులు, చివరికి అభిమానులు కూడా ఆ పేరు ని ఎక్స్ ప్లాయిట్ చేస్తున్నారు. చిరంజీవి కి తల నెప్పి తీసుకువస్తున్నారు.
కర్ణుడి చావు కి కారణాలు అనేకం అన్నట్లు ఇవన్నీ చిరంజీవి ఓటమి కి కారణం అవుతాయో లేక సినిమాల్లో లాగా వీటన్నిటినీ తట్టుకొని చిరంజీవి విజయం సాధిస్తాడో తెలుసుకోవాలంటే ఎన్నికలయ్యేదాకా ఆగాల్సిందే.

Thursday, February 26, 2009

ఆర్టిసి బస్సు.

ఇవ్వాళ టీ కొట్టు లో "ఈనాడు" కనపడితే అలా చూసేసరికి, ఎవరో మాదిగ (ఎమార్పీఎస్) కార్యకర్తలు ఆర్టిసి బస్సు ని తగల పెట్టారు అని రాశారు. చాలా బాధేసింది. ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్లు ఎవరు ఏ గొడవ చేయాలనుకున్నా వచ్చి ఆర్టిసి బస్సు మీద పడతారు. అసలు బస్సు ఏం పాపం చేసింది. మన రాష్ట్రం లో బైటికి వెళ్లాలంటే ఎక్కువ మంది వాడేది బస్సు. మనం ఏ ఊరు వెళ్లాలంటే ఆ ఊరికి చేర్చటమేనా ఆ బస్సు కాని ఆ సంస్థ కాని చేసే పాపం. అసలు అలా కాల్చేవాళ్లు జీవితం లో ఎన్ని సార్లు ఎక్కుంటారు బస్సు ని? అంతలా ఉపయోగపడే బస్సు ని ఎవడబ్బ సొమ్మని కాలుస్తారు ఆ దరిద్రులు, వాళ్లని ఇలాంటి విషయాలు చేయమని ప్రొత్సహించే రాజకీయ నాయకులు? నా ఉద్దేశం లో ఆ బస్సు ఖరీదు వసూలు చేయటం తో పాటు యావజ్జీవ శిక్ష విధించాలి అలా బస్సులని తగలబెట్టిన వాళ్లకి. ఏదన్నా నిరసన వ్యక్తం చేయాలంటే చేయాలంటే చేయాల్సిన విధానం లో చేయాలి గాని ఇలా జనాలకి ఉపయోగపడే వాటినల్లా తగల పెడితే ఎలా?

Thursday, January 29, 2009

ఆనందో బ్రహ్మ

ఈమధ్య 'సప్తగిరి' ఛానెల్ లో రాత్రి ౯.౪౫ (తొమ్మిది నలభై ఇదు కి) మళ్లీ "ఆనందో బ్రహ్మ" వస్తుంది. చిన్నప్పుడు దూరదర్శన్ లో విరగబడి చూసేవాళ్ళం ఈ కార్యక్రమాన్ని. కొద్ది కొద్దిగా గుర్తున్న అప్పటి కార్యక్రమాన్ని చూడటం భలేగా ఉంది. విశేషం ఏంటంటే ఇప్పుడు చూస్తున్నా కూడా మిగతా ఛానెల్స్ లో వచ్చే చెత్త కార్యక్రమాలకన్నా ఇది చాలా నయం.